పుట:Oka-Yogi-Atmakatha.pdf/649

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా అమెరికా ప్రయాణం

613

ప్రపంచమంతటా చెదురుమదురుగా ఉన్న నీ సోదరులందరి ఉత్తమగుణాల్నీ అన్వేషించి, వాటిని నీలో కలుపుకో.”

ఆ తరవాత నన్ను ఆశీర్వదించారు: “దేవుణ్ణి అన్వేషిస్తూ విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చేవాళ్ళందరికీ సహాయం లభిస్తుంది. నువ్వు వాళ్ళ వేపు చూస్తుంటే, నీ కళ్ళలోంచి వెలువడే ఆత్మ విద్యుత్ప్రవాహం వాళ్ళ మెదళ్ళలోకి ప్రవేశించి, వాళ్ళలో దైవస్పృహ ఇంకా పెరిగేటట్టు చేస్తూ వాళ్ళ భౌతి మైన అలవాట్లను మార్చేస్తుంది.” చిరునవ్వు నవ్వుతూ ఇంకా అన్నారు, “చిత్తశుద్ధి గల ఆత్మల్ని బాగా ఆకర్షించే శక్తి నీకు ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళినా - నట్టడవిలోనైనా సరే నీకు స్నేహితులు దొరుకుతారు.”

శ్రీయుక్తేశ్వర్‌గారి ఈ ఆశీస్సులు రెండూ సమృద్ధిగా ఫలించాయి. ఒక్క స్నేహితుడు కూడా లేకుండా, నేను ఒంటరిగా అమెరికా వచ్చాను, కాని ఇక్కడ, కాలాబాధితమయిన ఆత్మోపదేశాల్ని అందుకోడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు వేలకొద్దీ కనిపించారు.

నేను 1920 ఆగస్టులో, ‘ది సిటీ ఆఫ్ స్పార్టా’ అనే ఓడలో భారతదేశం నుంచి బయలుదేరాను. ప్రపంచయుద్ధం ముగిసిన తరవాత అమెరికాకు బయలుదేరిన మొట్టమొదటి ప్రయాణికుల ఓడ అదే. ప్రభుత్వ కార్యాలయ నిత్యపరిపాటి వ్యవహారాల్లో కేవలం గుడ్డిగా అనుసరించే పద్ధతులవల్ల నా పాస్‌పోర్టు మంజూరు కావడానికి అనేకమయిన అటంకాలు ఇబ్బందులూ, అలౌకిక అద్భుత రీతుల్లో తొలగిపోయిన తరవాతే నా ప్రయాణం టిక్కెట్టు బుక్‌ చేసుకోగలిగాను.

రెండు నెలలు పట్టిన ఆ ప్రయాణంలో, నా తోటి ప్రయాణికు డొకడు, నేను బోస్టన్ మహాసభకు భారతదేశ ప్రతినిధిగా వెళ్తున్న సంగతి కనిపెట్టాడు.