పుట:Oka-Yogi-Atmakatha.pdf/650

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

614

ఒక యోగి ఆత్మకథ

“స్వామి యోగానందా,” అంటూ చిత్రమైన ఉచ్ఛారణతో సంబోధించాడు నన్ను; నేను, ఉత్తరోత్తరా అమెరికన్ల ఉచ్ఛారణలో నా పేరు పలకగా విన్న అనేక రకాల్లో అది ఒకటి. “వచ్చే గురువారం రాత్రి మీరు ప్రయాణికులకు ఒక ఉపన్యాసం ఇచ్చి అనుగ్రహించండి. ‘జీవిత సంగ్రామం - దాన్ని ఎదుర్కోడం ఎలా?’ అన్న విషయం మీద మాట్లాడితే మా కెంతో లాభంగా ఉంటుందనుకుంటాను,” అన్నాడాయన.

అయ్యో! ఇప్పుడు నా జీవిత సంగ్రామాన్నే ఎదుర్కోవలసి వచ్చిందే అని తెలుసుకున్నాను బుధవారం నాడు. నా భావాల్ని ఇంగ్లీషులో ఒక ప్రసంగవ్యాసంగా రాయాలని ప్రయత్నించి, ఆ అవస్థ పడలేక, చివరికి అన్ని సన్నాహాలూ విరమించుకున్నాను. నా ఆలోచనలు, జీనుకేసి చూసిన అడవి గుర్రప్పిల్లలాగ, ఇంగ్లీషు వ్యాకరణ నియమాలతో సహకరించడానికి మొరాయించాయి. అయితే, మా గురుదేవుల వెనకటి హామీల్నే పూర్తిగా నమ్ము కొని, గురువారం నాడు, ఓడలో ఉన్న సమావేశం హాలులో హాజరయిన శ్రోతల ఎదటికి వచ్చాను. వాగ్దార ఏదీ నా పెదవుల దాకా రాలేదు; నోట మాటలేక, సభాసదుల ముందు అలాగే నిలబడిపోయాను. పది నిమిషాల పాటు సహన పరీక్షకి గురిఅయిన తరవాత శ్రోతలు, నా అవస్థ కనిపెట్టి నవ్వడం మొదలెట్టారు.

ఆ సమయంలో, ఆ పరిస్థితి నాకయితే వినోదంగా ఏం లేదు; దాన్ని అవమానకరంగా భావించి, నిశ్శబ్దంగా గురుదేవులకు నా విన్నపం పంపాను.

“నువ్వు మాట్లాడగలవు! ఊఁ, మాట్లాడు!” అంటూ ఆయన స్వరం తక్షణమే నా అంతరంగంలో ధ్వనించింది.

వెంటనే, నా భావాలు ఇంగ్లీషుభాషతో స్నేహసంబంధం ఏర్పరచుకున్నాయి. నలభై అయిదు నిమిషాల తరవాత కూడా శ్రోతలు సావధానంగా