పుట:Oka-Yogi-Atmakatha.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాశ్చాత్య ప్రపంచం గురించి బాబాజీ ఆసక్తి

601

పద్మాసనం వేసుకున్నారు; అద్భుతంగా, అంతిమమయిన మహాసమాధి[1]లోకి వెళ్ళిపోయారు.

“భక్తుల కెంతో ప్రియమైన, లాహిరీ మహాశయుల సుందరదేహాన్ని గృహస్థోచితమైన కర్మకాండతో, పావన గంగాతీరాన మణికర్ణికా ఘట్టంలో దహనం చేశారు,” అంటూ చెప్పారు కేశవానందగారు. “ఆ మర్నాడు పొద్దున పది గంటలకు, నే నింకా కాశీలోనే ఉండగా, నా గది ఒక మహత్తరమైన కాంతితో కమ్ముకుపోయింది. ఆహా! లాహిరీ మహాశయుల రూపం, రక్తమాంసాలు నిండిన శరీరంలో నా ఎదురుగా నిలబడి ఉంది. అది అచ్చం, ఆయన వెనకటి శరీరంలాగే ఉంది కాని, దానికన్న ఇది తక్కువ వయస్సులో ఉన్నట్టూ దానికన్న తేజోవంతంగానూ ఉంది. గురుదేవులు నాతో మాట్లాడారు.”

“ ‘కేశవానందా, నేనే, దహనమయిన నా శరీరం తాలూకు విఘటిత పరమాణువుల నుంచి నా రూపాన్ని కొత్త నమునాగా సృష్టించి పునరుత్థానం కావించాను. గృహస్థుగా ఈ ప్రపంచంలో నా పని పూర్తిఅయింది. కాని నే నీ భూమిని పూర్తిగా విడిచి పోను. ఇకనుంచి, బాబాజీతో హిమాలయాల్లో కొంతకాలం గడుపుతాను; ఆ తరవాత బాబాజీతో బ్రహ్మాండంలో.’ ”

“ఆశీః పురస్సరంగా నాతో కొన్ని మాటలు పలికి అంతర్ధానమయారు, లోకాతీత గురుదేవులు. అద్భుతమైన ఉత్తేజంతో నిండిపోయింది

  1. శరీరాన్ని మూడుసార్లు గుండ్రంగా తిప్పడం, ఉత్తరాభిముఖం కావడం వైదిక కర్మకాండలో భాగాలు, తమ భౌతిక కాయానికి అంతిమ ఘడియ ఎప్పుడువస్తుందో ముందుగా తెలిపిన మహాగురువులు ఇలా చేస్తారు. చివరి ధ్యానంలో మహాగురువులు, ఓంకార విశ్వనాదంలో లయమవుతారు; ఈ చివరి ధ్యానాన్నే ‘మహాసమాధి’ అంటారు.