పుట:Oka-Yogi-Atmakatha.pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాశ్చాత్య ప్రపంచం గురించి బాబాజీ ఆసక్తి

597

“ ‘అభినందనలు, స్వామీజీ!’ నేను కలగనడం లేదని నమ్మకం కలిగించడానికి, మహాగురువుల కంఠస్వరం మధురంగా ధ్వనించింది. ‘మీ పుస్తక రచన విజయవంతంగా ముగించడం గమనించాను. మీకు మాట ఇచ్చిన ప్రకారం, మీకు ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడున్నాను.’ ”

“దడదడలాడుతున్న గుండెతో, ఆయన పాదాలముందు సాగిలపడ్డాను. పరమగురూజీ, ‘మీరూ మీ శిష్యులూ, దగ్గరిలో ఉన్న మా ఇంటిని పావనం చెయ్యరూ?’ అంటూ ప్రాధేయపూర్వకంగా విన్న వించుకున్నాను.”

“పరమ గురువులు చిరునవ్వుతో నిరాకరించారు. ‘వద్దు, నాయనా, చెట్లనీడంటే ఇష్టపడే మనుషులం మేము; ఈ చోటు చక్కగా సుఖంగా ఉంది.’ ”

“ ‘కాస్సేపు ఉండండి,’ అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన వేపు చూశాను. ‘కొన్ని ప్రత్యేకమైన మిఠాయిలు తీసుకుని చటుక్కున చక్కా వస్తాను.’[1]

“కొద్ది నిమిషాల్లో నేను ఫలహారాల పళ్ళెంతో తిరిగి వచ్చేసరికి, విశాల వటవృక్షం నీడన ఆ దివ్యస్వరూపుల బృందం లేదు. రేవు చుట్టు పక్కలంతా గాలించాను; ఆ సాధుబృందం గాలిరెక్కల మీద అదివరకే ఎగిరిపోయిందని నా హృదయానికి తెలుసు.

“నా మనసు తీవ్రంగా గాయపడింది. ‘మళ్ళీ మేం కలుసుకున్నాకూడా, నేను బాబాజీతో మాటే ఆడను’ అనుకున్నాను మనసులో. ‘అంత హఠాత్తుగా ఆయన వెళ్ళిపోయి, నా మీద నిర్దయ చూపించారు.’ నిజంగా ఇది ప్రణయ కోపం; అంతకిమించి మరేమీ లేదు.

  1. గురువుల దర్శనం చేసుకున్నప్పుడు ఫలహారాలు సమర్పించకపోవడం, భారతదేశంలో ఆయన్ని అగౌరవపరచడం కింద లెక్కకు వస్తుంది.