పుట:Oka-Yogi-Atmakatha.pdf/632

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

596

ఒక యోగి ఆత్మకథ

శాస్త్ర గ్రంథాల్నీ సరిపోల్చి చూడడంలో నిమగ్నుణ్ణి అయాను. పావనమూర్తి ఏసు ప్రభువు వాక్కుల్ని ఉదాహరిస్తూ, ఆయన ఉపదేశాలు వస్తుతః, వేదదర్శనాలతో ఏకీభవిస్తాయని నిరూపించాను. పరమగురువు[1]ల కృపవల్ల, ది హోలీ సైన్స్ (కైవల్య దర్శనం)[2] అన్న నా పుస్తకం చాలా కొద్దికాలంలోనే పూర్తి అయింది.

“నా రచనా కార్యక్రమం ముగిసిన మర్నాడు పొద్దున, గంగలో స్నానం చెయ్యడానికి ఇక్కడ రాయ్‌ఘాట్ రేవుకు వెళ్ళాను,” అంటూ చెప్పారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “రేవు నిర్మానుష్యంగా ఉంది; వెచ్చ వెచ్చని ఎండలో ప్రశాంతిని అనుభవిస్తూ కొద్దిసేపు నిలకడగా ఉండిపోయాను. తళతళ లాడే నీళ్ళలో ఒక్క మునుగు మునిగి ఇంటికి బయలుదేరాను. ఆ నిశ్శబ్దంలో వినవస్తున్న శబ్దమల్లా, నేను అడుగుతీసి అడుగు వేస్తున్నప్పుడు, గంగలో తడిసిన బట్ట రెపరెపలాడుతూ చేస్తున్న చప్పుడే. ఏటి ఒడ్డున విశాలమైన పెద్ద మర్రిచెట్టున్న తావు దాటి కొంచెం వెళ్ళేసరికి, ఎందుకో వెనక్కి తిరిగి చూడాలన్న గట్టి ఊపు ఒకటి వచ్చింది.

అక్కడ, మర్రిచెట్టు నీడన, కొద్దిమంది శిష్యుల నడుమ కూర్చుని ఉన్నారు మహామహులు బాబాజీ!,

  1. పరమగురువు అంటే “అతీత గురువు” అని వాచ్యార్థం; ఇది గురు పరంపరను సూచిస్తుంది. లాహిరీ మహాశయుల గురువులైన బాబాజీ, శ్రీయుక్తేశ్వర్ గారికి పరమగురువులు. క్రియాయోగ సాధనచేసే ఎస్. ఆర్. ఎఫ్. వై. ఎస్. ఎస్. సభ్యులందరికీ బాబాజీ పరుగురువులు.
  2. ఇప్పుడు భారతదేశంలో బీహారులో, రాంచీలో ఉన్న యోగదా సత్సంగ సొసైటీ వారు దీన్ని ప్రచురించారు.