పుట:Oka-Yogi-Atmakatha.pdf/634

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

598

ఒక యోగి ఆత్మకథ

“మరి కొన్ని నెల్లకి నేను కాశీలో లాహిరీ మహాశయుల్ని దర్శించాను. నేను గదిలోకి ప్రవేశించగానే, మా గురువులు, పలకరింపుగా చిరునవ్వు నవ్వారు.”

“ ‘రావయ్యా, యుక్తేశ్వర్’ అన్నారాయన. ‘నా గది గుమ్మంలో నువ్వు బాబాజీని చూశావా?’ ”

“ ‘లేదండి’ అని జవాబిచ్చాను, ఆశ్చర్యంగా.”

“ ‘ఇలా రా.’ లాహిరీ మహాశయులు, నా నుదుటిని మెల్లగా స్పృశించారు; వెంటనే చూశాను, తలుపు దగ్గర, ప్రపుల్ల పద్మ సదృశులైన బాబాజీ సుందరరూపాన్ని.

“నా మనస్సుకు తగిలిన వెనకటి గాయం గుర్తుకు వచ్చింది; నేను ప్రణామం చెయ్యలేదు. లాహిరీ మహాశయులు ఆశ్చర్యచకితులై చూశారు నావేపు.”

“అగాధమైన కళ్ళతో నా వేపే చూస్తున్నారు దివ్యగురువులు, ‘నా మీద కోపంగా ఉంది నీకు.’ ”

“ ‘ఔనండి, ఎందుకుండగూడదు?’ అని జవాబిచ్చాను. ‘గాలిలోంచి వచ్చారు. మీ గారడివాళ్ళ జట్టుతో; ఆ పల్చటి గాలిలోకే మళ్ళీ మాయమయారు.’ ”

“ ‘నేను నిన్ను చూస్తాననే చెప్పాను కాని, ఎంతసేపుంటానో చెప్పలేదు.’ బాబాజీ మృదువుగా నవ్వారు. ‘నువ్వు ఉత్సాహాతిరేకంలో ఉన్నావు. నీ అశాంతి గాలిదుమారంలోనే నేను ఎగిరిపోయానని నీకు నమ్మకంగా చెప్పదలుచుకున్నాను.’ ”

“పొగడ్త లేని ఈ సంజాయిషీతో తక్షణమే తృప్తిపడ్డాను నేను.”