పుట:Oka-Yogi-Atmakatha.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

588

ఒక యోగి ఆత్మకథ

“నేను బాబాజీని కలుసుకున్న నాటికింకా నేను స్వామిని కాలేదు.” అంటూ చెబుతూ వచ్చారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “కాని అప్పటికి, లాహిరీ మహాశయుల దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నాను. 1894 జనవరిలో అలహాబాదులో జరిగే మేళాకు వెళ్ళమని నన్నాయన ప్రోత్సహించారు. నాకది మొట్టమొదటి కుంభమేళా అనుభవం. ఆ కోలాహలమూ ఆ జన ప్రవాహమూ చూసి నేను కొద్దిగా దిగ్భ్రమ చెందాను. చుట్టూ గుచ్చిగుచ్చి చూశాను; తేజస్సుగల ఒక్క సద్గురువు ముఖమూ నాకు కనిపించలేదు. గంగానది ఒడ్డున ఒక వంతెన దాటుతూ ఉండగా, దగ్గరలోనే నిలబడి ఉన్న ఒక పరిచయస్థుణ్ణి చూశాను; అతని భిక్షాపాత్ర ముందుకు చాపి ఉంది.

“ ‘ఈ మేళా అంతా గోలా గందరగోళమూ బిచ్చగాళ్ళూ తప్ప మరేం లేదు,’ అనుకున్నాను నిరాశపడి. మనస్సును భిక్షాల మీదే నిలిపి పైకి ధర్మోపదేశాలు చేసే ఈ సోమరులకన్న మానవ కళ్యాణంకోసం విజ్ఞాన రంగాల్ని ఓర్పుతో విస్తరింపజేస్తున్న పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తలు, దేవుడికి ఎక్కువ సంతోషం కలిగించడం లేదా?’ అనిపించింది.

“నా ఎదురుగా వచ్చి ఆగిన పొడుగాటి ఒక సన్యాసి కంఠస్వరం, సమాజ సంస్కరణ గురించి నాలో రగులుతున్న ఆలోచనలకు అంతరాయం కలిగించింది.”

“ ‘మహాశయా, మిమ్మల్ని ఒక సాధువు పిలుస్తున్నారండి.’ అన్నాడతను.”

“ ‘ఎవరాయన?’ ”

“ ‘వచ్చి మీరే చూడండి.’ ”

“కొంచెం వెనకాడుతూనే, ఆయన టూకీగా ఇచ్చిన ఈ సలహాని