పుట:Oka-Yogi-Atmakatha.pdf/623

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 36

పాశ్చాత్య ప్రపంచం గురించి

బాబాజీ ఆసక్తి

“గురుదేవా, మీ రెప్పుడయినా బాబాజీని కలుసుకున్నారా?”

శ్రీరాంపూర్‌లో ప్రశాంతమైన ఒక వేసవిరాత్రి అది; ఆశ్రమం రెండో అంతస్తు బాల్కనీలో నేను శ్రీయుక్తేశ్వర్ గారి పక్కన కూర్చుని ఉన్నప్పుడు, మా తలలకు పైన పెద్ద పెద్ద నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి.

“ఆ” నా సూటిప్రశ్నకు గురుదేవులు చిరునవ్వు నవ్వారు; ఆయన కళ్ళు భక్తి ప్రపత్తులతో ప్రకాశించాయి. “మూడుసార్లు ఆ అమర గురువుల దర్శనభాగ్యం కలిగింది. మేము మొదటిసారి కలుసుకోడం, అలహాబాదులో, కుంభమేళా సందర్భంలో.”

చిరకాలంగా భారతదేశంలో జరిపే మతధార్మిక ఉత్సవాల్ని కుంభమేళా లంటారు. ఆధ్యాత్మిక లక్ష్యాల్ని అవి జనబాహుళ్యం దృష్టిలో ఎప్పుడూ నిలుపుతూ ఉంటాయి. శ్రద్ధాళువులైన హిందువులు, వేలాదిమంది సాధువుల్నీ, యోగుల్నీ, స్వాముల్నీ, తపస్వుల్నీ- అన్ని రకాల వాళ్ళనీ దర్శించుకోడానికి, ప్రతి ఆరేసేళ్ళకి కాని పన్నెండేసేళ్ళకి కాని ఒకసారి చొప్పున లక్షలకి లక్షలు వచ్చి చేరతారు. మామూలుగా ఎన్నడూ ఏకాంత స్థానాల్ని విడిచిరాని సాధువులు చాలామంది ఈ మేళాలకు హాజరయి ప్రాపంచిక స్త్రీపురుషులకు తమ ఆశీస్సులు అందిస్తారు.