పుట:Oka-Yogi-Atmakatha.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

586

ఒక యోగి ఆత్మకథ

గృహస్థ యోగిగా లాహిరీ మహాశయులు, ఈనాటి ప్రపంచం అవసరాలకు అనువయిన, ఆచరణానుకూల సందేశం ఒకటి అందించారు. ప్రాచీన భారతదేశంలో ఉన్న అద్భుతమైన ఆర్థిక, మతధార్మిక స్థితులు ఈనాడు లేవు. అందువల్ల యోగి భిక్షాపాత్ర చేత బుచ్చుకొని సంచారం చేసే తపస్విగా జీవించాలన్న పాతకాలపు ఆదర్శాన్ని ఆ మహాయోగి ప్రోత్సహించలేదు. దాని బదులు, ఇప్పటికే ఎంతో ఒత్తిడికి గురిఅయి ఉన్న సమాజం మీద ఆధారపడి ఉండకుండా యోగి, తన బతుకు తాను బతకడానికి కావలసినది సంపాదించుకోడంలోనూ, తన ఇంట్లోనే ఏకాంతంగా ఒకచోట యోగసాధన చెయ్యడంలోనూ గల లాభాలు నొక్కి చెప్పారు. ఈ సలహాకు తోడుగా, హర్షదాయకమైన తమ ఆదర్శబలాన్ని ఆయన జోడించారు. ఆయన ఆధునికులయిన, సర్వశ్రేష్ఠ ఆదర్శరూపులయిన యోగి. ఆయన జీవన మార్గం, ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉండే యోగసాధకులకు మార్గదర్శకంగా ఉండాలని బాబాజీ ప్రణాళికలో నిర్ణయమయింది.

కొత్తవాళ్ళ కొక కొత్త ఆశా రేఖ! “దైవసాయుజ్యం స్వయంకృషి ద్వారా సాధ్యం” అనీ, “అది దైవశాస్త్ర సంబంధమైన విశ్వాసాలమీద కాని విశ్వనియంత నిరంకుశ సంకల్పంమీద కాని ఆధారపడి ఉన్నది కాదు” అనీ యోగావతారులు ఉద్ఘాటించారు.

మానవుడి దివ్యత్వంమీద విశ్వాసమేర్పరచుకోలేని వ్యక్తులు, క్రియాయోగ కీలకాన్ని ఉపయోగించి చివరికి, తమ సంపూర్ణ దివ్యత్వాన్ని దర్శిస్తారు.