పుట:Oka-Yogi-Atmakatha.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాహిరీ మహాశయుల పావన జీవనం

585

గుణాత్మక, పరిమాణాత్మక ప్రమాణాలు రెండిటి దృష్ట్యా, లాహిరీ మహాశయులు, సమాజం ఆధ్యాత్మిక స్థాయిని సమున్నతం చేశారు. తమ సన్నిహిత శిష్యుల్ని క్రీస్తు మాదిరి ఉన్నత మూర్తి మత్వానికి పెంచడానికి వారికున్న శక్తినిబట్టి, జనబాహుళ్యంలో సత్యాన్ని విస్తృతంగా వ్యాప్తిచేయడాన్ని బట్టి లాహిరీ మహాశయులు, మానవజాతి రక్షకుల కోవలోకి వస్తారు.

ప్రవక్తగా ఆయన అద్వితీయత, యోగవిముక్తి ద్వారాల్ని మొట్ట మొదటిసారిగా మానవులందరికోసం తెరుస్తూ, క్రియాయోగమనే ఒక నిర్దిష్ట పద్ధతిని ఆచరణాత్మకంగా నొక్కిచెప్పడంలో ఉంది. ఆయన జీవితంలో గోచరించిన అలౌకిక ఘటనల సంగతి అలా ఉంచి, నిజంగా ఆ యోగావతారులు, యోగవిద్యలోని పూర్వపు జటిలతల్ని తగ్గించి సాధారణ బుద్ధికి ఆవహన అయేటట్టుగా ఫలవంతమైన సరళత్వాన్ని సాధించడం అద్భుతాలన్నిటికీ పరాకాష్ఠ.

అలౌకిక ఘటనల్ని గురించి ప్రస్తావిస్తూ లాహిరీ మహాశయులు తరచు ఇలా అనేవారు: “జనబాహుళ్యానికి తెలియని సూక్ష్మనియమాలు పనిచేసే తీరును తగినంత విచక్షణలేకుండా బహిరంగంగా చర్చించనూ గూడదు, ప్రచురించనూ గూడదు.” ఈ పుస్తకంలో నే నెక్కడయినా, ఆయన హెచ్చరికగా చెప్పిన మాటల్ని ఉల్లంఘించినట్టు కనిపించినట్టయితే, ఆయన నాకు ఆంతరికమైన హామీ ఇవ్వడమే కారణమని గ్రహించాలి. అయినప్పటికీ బాబాజీ, లాహిరీ మహాశయ, శ్రీయుక్తేశ్వర్ గార్ల జీవితాల్ని గ్రంథస్థం చేసేటప్పుడు నేను, కొన్ని కొన్ని అలౌకిక ఘటనలు మినహాయించడం మంచిదని అనుకున్నాను. ఈ గుహ్య దర్శన శాస్త్రానికి వివరణాత్మక గ్రంథం కూడా ఒకటి రాయకుండా వాటిని చేర్చలేకపోయేవాణ్ణి.