పుట:Oka-Yogi-Atmakatha.pdf/620

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

584

ఒక యోగి ఆత్మకథ

దారి కనుక్కుంటాడు; ఆ ప్రకృతి శక్తులు (దృగ్విషయాలు] మార్మికమైన వయినా, దైనందిన సంఘటనలయినా సరే.[1] ఒక వెయ్యేళ్ళ కిందట మార్మిక విషయాలుగా అనిపించినవి ఈనాడు అలా అనిపించడం లేదనీ, ఈనాడు మార్మిక విషయాలనిపిస్తున్నవి మరో వందేళ్ళకు శాస్త్ర నియమబద్ధాలుగా మనకు అవగాహన కావచ్చుననీ మనం గుర్తుంచుకోవాలి.

“క్రియాయోగ శాస్త్రనియమం శాశ్వతమైనది. ఆది గణితశాస్త్రంలా సత్యమైనది; కూడికలూ తీసివేతలూ వంటి సరళ సూత్రాల మాదిరిగా, క్రియాయోగ నియమం కూడా ఎన్నటికీ నశింపు కానిది. గణితశాస్త్రం మీద రాసిన గ్రంథాలన్నింటినీ తగలబెట్టెయ్యండి; తర్కబుద్ధిగలవాళ్ళు అటువంటి సత్యాల్ని ఎప్పుడూ తిరిగి కనుక్కుంటూనే ఉంటారు. యోగం మీదున్న పుస్తకాలన్నింటినీ నాశనం చెయ్యండి; దాని మూల సూత్రాలన్నీ, నిర్మల భక్తీ తదనుసారంగా నిర్మల జ్ఞానమూ గల యోగి అవతరించినప్పుడల్లా మళ్ళీ వెల్లడి అవుతూనే ఉంటాయి.”

అవతారపురుషు లందరిలోకీ బాజాజీ మహావతార స్వరూపులయినట్టు, శ్రీయుక్తేశ్వర్‌గారిని న్యాయతః జ్ఞానావతార స్వరూపులుగా పేర్కొన దగినట్టుగానే, లాహిరీ మహాశయులు యోగావతార స్వరూపులు.[2]

  1. “ఆశ్చర్యపోజాలని వాడూ, అలవాటుగా ఆశ్చర్యపోని (ఆశ్చర్యపోయి పూజించని) వాడూ - అతను అనేక రాయల్ సొసైటీలకు అధ్యక్షుడైనా, అన్ని ప్రయోగశాలల, వేధశాలల ప్రతీకల్నీ వాటి ఫలితాలన్నీ ఒక్క తన బుర్రలోనే ఇముడ్చుకుని ఉన్నవాడైనా– వెనకాల కన్నులేని కళ్ళజోడు లాంటివాడు.”

    - కార్లైల్, ‘సార్టర్ రిసార్టన్’లో.

  2. శ్రీయుక్తేశ్వర్‌గారు తమ శిష్యులైన పరమహంస యోగానందగారిని దివ్య ప్రేమావతారులుగా పేర్కొన్నారు. పరమహంసగారి నిర్యాణానంతరం, ఆయన ప్రధాన శిష్యులు రాజర్షి జనకానంద (శ్రీ జేమ్స్ జె. లిన్); ‘ప్రేమావతార’ స్వరూపులనే అత్యంత సముచితమైన బిరుదు ఆయనకు అర్పించారు.