పుట:Oka-Yogi-Atmakatha.pdf/597

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాల్లో మహాభవన సృష్టి

561

కండి. వాళ్ళు అవిశ్వాసులే అయినప్పటికీ, చిత్రమైన నా ప్రతిజ్ఞావాక్యంలోని సత్యాన్ని శోధించడానికయినా కనీసం సుముఖంగా ఉన్నారు.’ ”

“ ‘సరే, కొంచెం సేపు ఉంటాను. స్నేహితులముందు నీ మాట పోవడం నాకు ఇష్టం లేదు,’ అన్నారు బాబాజీ. ఆయన ముఖం శాంత పడింది. కాని మృదువుగా ఇలా అన్నారు: ‘నాయనా, ఇకనుంచి నేను నీకు అవసరమయినప్పుడే వస్తాను; నువ్వు పిలిచినప్పుడల్లా మాత్రం రాను.’[1]

“నేను తలుపు తెరిచినప్పుడు మిత్రబృందంలో గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది. తమ కళ్ళని తామే నమ్మలేక నా మిత్రులు, గొంగడి ఆసనం మీద ఉన్న తేజోవంతమైన స్వరూపాన్ని తేరిపారి చూశారు.”

“ ‘ఇది సామూహిక సమ్మోహనం!’ అంటూ అట్టహాసంగా నవ్వాడొకతను. ‘మాకు తెలియకుండా ఈ గదిలోకి ఎవరూ ప్రవేశించడం అసంభవం!’ ”

“బాబాజీ చిరునవ్వు చిందిస్తూ ముందుకు వచ్చి, తమ శరీరంలోని వెచ్చని, గట్టి మాంసాన్ని ముట్టుకొని చూడమని ప్రతి ఒక్కరి దగ్గరికీ వెళ్ళారు. సందేహాలు పటాపంచలయిపోయి మా స్నేహితులు, దిగ్బ్రమతో కూడిన పశ్చాత్తాపంతో నేలమీద పడి సాష్టాంగ ప్రణామం చేశారు.”

  1. ఆత్మసాక్షాత్కార సాధన పథంలో లాహిరీ మహాశయుల వంటి జ్ఞానులైన మహాపురుషులు కూడా ఉత్సాహాతిశయానికి లోబడిపోయి క్రమశిక్షణకు గురి అవుతూ ఉంటారు. దివ్యగురువైన కృష్ణుడు, భక్తాగ్రణి అయిన అర్జునుణ్ణి మందలించడం, భగవద్గీతలో, చాలా సందర్భాల్లో చదువుతాం.