పుట:Oka-Yogi-Atmakatha.pdf/596

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

560

ఒక యోగి ఆత్మకథ

అద్భుతం చూడాలన్న ఉత్సుకత వాళ్ళలో కలగడంలో విడ్డూరం లేదు. కొంతమట్టుకు అనిష్టంగానే నేను, ప్రశాంతమైన ఒక గది, రెండు కొత్త గొంగళ్ళు కావాలని అడిగాను.

“ ‘గురుదేవులు ఆకాశం (ఈథర్) లోంచి భౌతికరూపం ధరిస్తారు’, అన్నాను. ‘తలుపవతల నిశ్శబ్దంగా ఉండండి; కాస్సేపట్లో పిలుస్తా మిమ్మల్ని.’ ”

“మా గురుదేవుల్ని సవినయంగా ఆవాహనచేస్తూ ధ్యానస్థితిలో మునిగిపోయాను. చీకటి చేసిన గది, ప్రశాంతి కలిగించే పలచని వెలుతురుతో నిండిపోయింది; దాంట్లోంచి తేజోవంతమైన బాబాజీ ఆకృతి క్రమంగా వెలువడింది.”

“ ‘లాహిరీ, ఇంత స్వల్ప విషయం కోసం పిలుస్తావా నన్ను?’ గురుదేవుల చూపు కఠినంగా ఉంది. ‘సత్యమన్నది హృదయపూర్వకంగా అన్వేషించేవాళ్ళకోసం; వ్యర్థమైన కుతూహలం గలవాళ్ళకోసం కాదు. ఎవరయినా, చూసినప్పుడు నమ్మడం సులువే; అప్పుడిక కాదనడానికి ఏమీ ఉండదు. అతీంద్రియ సత్యాన్ని అనుభూతం చేసుకోడానికి యోగ్యులూ దాన్ని ఆవిష్కరించేవాళ్ళూ, స్వాభావిక భౌతికవాదపరమైన సంశయశీలతను జయించినవాళ్ళే,’ ఆ తరవాత ఆయన గంభీరంగా, ‘నన్ను వెళ్ళనియ్యి!’ అన్నారు.

“నేను బతిమాలుకుంటూ ఆయన పాదాలమీద పడ్డాను. “పూజ్య గురుదేవా, ఘోరమయిన నా తప్పు తెలుసుకున్నాను; సవినయంగా మీ క్షమాపణ కోరుతున్నాను. నేను మిమ్మల్ని పిలవడానికి సాహసించింది, ఆధ్యాత్మికంగా గుడ్డివాళ్ళయిన వీళ్ళ మనస్సుల్లో విశ్వాసం కలిగించడానికి. నా ప్రార్థన మన్నించి, మీరు ఎలాగా ప్రత్యక్షమయారు కనక,