పుట:Oka-Yogi-Atmakatha.pdf/582

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

546

ఒక యోగి ఆత్మకథ

“ ‘లాహిరీ, నీకు పరిశుద్ధి అవసరం. ఈ గిన్నెలో ఉన్న నూనె తాగి, ఏటి ఒడ్డున పడుకో,” అన్నాడు బాబాజీ. బాబాజీ వ్యవహారజ్ఞానంలో ఎప్పుడూ ముందు జాగ్రత్త ఉంటుంది - అనుకున్నాను; వెనకటి జ్ఞాపకంతో చటుక్కున చిరునవ్వు వచ్చింది.”

“ఆయన చెప్పిన ప్రకారం చేశాను. చల్లటి హిమాలయ రాత్రి ముసురుతూ ఉన్నప్పుటికీ నాలో, హాయి అనిపించే వెచ్చదనం వ్యాపించడం మొదలయింది. నేను ఆశ్చర్యపోయాను. ఏమిటో తెలియని ఆ నూనెలో పొద్దుపొడుపు వెచ్చతనాన్ని ఏమయినా రంగరించారా?”

“ఆ చీకట్లో, తీవ్రమైన గాలులు చెలరేగి భయంకరంగా సవాలు చేస్తున్నట్టు గర్జిస్తూ, చుట్టూ నన్ను కొరడాలతో కొడుతున్నాయి. గగాస్ నదిలోని చల్లని చిట్టిపొట్టి అలలు, రాతిగొట్టు ఏటిగట్టున కాళ్ళు చాపి వెల్లకిలా పడుకున్న నా ఒంటిమీదికి వచ్చి పడుతున్నాయి. దగ్గరిలో పులులు గాండ్రిస్తున్నాయి; అయినా నా గుండెలో ఎంతమాత్రం భయం లేదు; నాలో కొత్తగా పుట్టిన ఉష్ణప్రసరణ శక్తి, అభేద్యమైన రక్షణ ఉందని హామీ తెలియజేసింది. చాలా గంటలు వేగంగా గడిచిపోయాయి. వెల్లబారిన పూర్వజన్మ స్మృతులు నా గురుదేవులతో ఇప్పుడు కలిగిన ఉజ్వల పునస్సమాగమంతో కలిసి పడుగుపేకల పనివరసగా అల్లుకు పోయాయి.”

“ఏవో అడుగుల చప్పుడు దగ్గరవుతుండగా, ఒంటరిగా నేను చేస్తున్న ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఆ చీకట్లో ఒక మనిషి నాకు చెయ్యి అందిచ్చి, నేను లేచి నిలబడ్డానికి సాయపడ్డాడు; తరవాత కొన్ని పొడిబట్టలు ఇచ్చాడు.”

“ ‘రా అన్నా, గురుదేవులు నీ కోసం ఎదురు చూస్తున్నారు,’ అన్నాడతను.”