పుట:Oka-Yogi-Atmakatha.pdf/581

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాల్లో మహాభవన సృష్టి

545

దాంతో నువ్వెళ్ళిపోయావు! నువ్వు నన్ను చూడలేకపోయినా, నీ మీంచి నా చూ పెన్నడూ చెదరలేదు. మహిమాన్వితులైన దేవదూతలు ప్రయాణం చేసే తేజోమయ సూక్ష్మసాగరం మీద నిన్ను వెన్నంటే వచ్చాను. తల్లిపక్షి తన పిల్లలను కాపాడుకుంటూ ఉన్నట్టుగా - చిమ్మ చీకట్లో, తుఫానులో, అల్లకల్లోలంలో, వెలుగులో నీ వెనకాలే ఉంటూ వచ్చాను. మానవోచితమైన మాతృగర్భవాసజీవితం నువ్వు పూర్తి చేసుకొని పసిపాపడుగా భూమిమీద పడ్డప్పటినించి నా కన్నెప్పుడూ నీ మీదే ఉంది. చిన్నతనంలో నువ్వు ఘుర్ణీ ఇసకదిబ్బల్లో పద్మాసనం వేసుక్కూర్చుని, నీ చిన్నారి ఒంటిని ఇసకతో కప్పేసుకుని ఉన్నప్పుడు, నేను అదృశ్యంగా అక్కడే ఉన్నాను. ఫలించిన ఈ శుభదినం కోసం ఓపికగా ఎదురుచూస్తూ, నెలలకు నెలలు, ఏళ్ళకు ఏళ్ళు నిన్ను కనిపెట్టుకొనే ఉన్నాను. ఇప్పటికి నువ్వు నా దగ్గరున్నావు! ఇదుగో నీ గుహ; పూర్వంనుంచీ నీకు ప్రియమయినది. నీ కోసం దీన్ని ఎప్పటికీ శుభ్రంగా, సిద్ధంగా ఉంచాను. పునీతమయిన నీ గొంగడి ఆసనం ఇదుగో; విశాలమవుతున్న నీ హృదయాన్ని దైవభక్తితో నింపడం కోసం నువ్వు నిత్యమూ కూర్చున్నది ఇక్కడే. నేను తయారుచేసి ఇచ్చిన అమృతాన్ని తాగడానికి నువ్వు తరచు ఉపయోగిస్తూ వచ్చిన గిన్నె ఇదుగో. చూడు, ఈ ఇత్తడి గిన్నె ఎంత తళతళలాడేలా మెరుగు పెట్టి ఉంచానో! ఎందుకు? ఎప్పుడో ఒకనాడు నువ్వు మళ్ళీ దాంతో తాగుతావని. నాయనా, ఇప్పుడర్థమయిందా నీకు?”

“ ‘గురుదేవా, ఏం చెప్పగలను నేను?’ అంటూ తడబడుతూ మెల్లగా అన్నాను. ‘ఇటువంటి అమరప్రేమ గురించి ఎక్కడయనా, ఎవ్వరయినా విన్నారా?’ నా శాశ్వత నిధిని జీవితంలోనూ మరణంలోనూ కూడా. నావారైన గురుదేవుల్ని, ఆనంద తన్మయుణ్ణయి తదేకంగా చూస్తూ ఉండిపోయాను.