పుట:Oka-Yogi-Atmakatha.pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

534

ఒక యోగి ఆత్మకథ

అవతారమూర్తి సార్వత్రికమయిన చిదాత్మలో జీవిస్తాడు. నాలుగు దిశల మధ్య దూరభావం ఆయనకు ఉండదు. కాబట్టి బాబాజీ శతాబ్దాల తరబడిగా తమ భౌతికరూపాన్ని నిలుపుకోడానికి ప్రేరణ కలిగించిన ఒకే ఒక కారణం ఏమిటంటే: మానవజాతికి గల సాధ్యాలకు వాస్తవ నిదర్శన ఒకటి చూపించాలన్న కోరిక. దైవత్వాన్ని మాంసల (మానవ) రూపంలో దర్శించే అవకాశం కనక మనిషికి లేకపోయినట్లయితే, మర్త్యత్వాన్ని అధిగమించలేమనే భారమైన మాయా బ్రాంతి అతన్ని అణచిపెట్టి ఉంచుతుంది.

ఏసుక్రీస్తుకు తన జీవితక్రమ మేమిటో మొదటినుంచి తెలుసు. తన జీవితంలోని ప్రతి ఒక్క సంఘటననూ ఆయన అనుభవించింది. తన కోసమూ కాదు, కర్మనిర్బంధం వల్లా కాదు; చింతనాపరులయిన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే సువార్తికులు (ఇవాంజిలిస్టులు) నలుగురూ భావితరాలవారి ఉపయోగార్థం అద్భుత జీవిత నాటకాన్ని గ్రంథస్థం చేశారు.

భూతభవిష్యద్వర్తమానాల సాపేక్షత కూడా బాబాజీకి లేదు. ఆయనకు తమ జీవిత దశలన్నీ మొదటి నుంచి తెలుసు. మానవుల పరిమిత అవగాహన శక్తికి అనుగుణంగా బాబాజీ, తమ దివ్యజీవన చర్యలనేకం, ఒకరు లేదా అంతకన్న ఎక్కువమంది సమక్షంలో నిర్వహించారు. ఆ విధంగా, శారీరకమైన అమరత్వానికున్న అవకాశాన్ని తాము ప్రకటించడానికి సమయం ఆసన్నమయిందని బాబాజీ భావించినప్పుడు లాహిరీ మహాశయుల శిష్యు లొకరు వారి సన్నిధిలో ఉండడం తటస్థించింది. తామిచ్చే హామీ ఇతర అన్వేషక హృదయాలకు స్ఫూర్తి నిస్తుందన్న ప్రసిద్ధి చివరికి పొందాలని బాబాజీ, శ్రీ రామగోపాల్ మజుందార్‌గారు ఉండగా ఈ హామీ ప్రకటించారు. మహాత్ము లెప్పుడూ తమ మాటలు