పుట:Oka-Yogi-Atmakatha.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చనిపోయిన రాముణ్ణి బతికించడం

511

తెలియని అమూర్తత్వాన్ని మహిమాన్వితం చెయ్యలేడు. ఋషుల తలల చుట్టూ ఉండే ‘దివ్యప్రభ’ లేదా కాంతి పరివేషం, దైవారాధన చెయ్యడానికి వారికి గల శక్తికి ప్రతీకాత్మక సాక్ష్యం.

చనిపోయిన లాజరు తిరిగి లేవడానికి సంబంధించిన అద్భుతకథను చదవడం శ్రీయుక్తేశ్వర్‌గారు కొనసాగించారు. కథ ముగిసిన తరవాత చాలాసేపు మౌనం వహించారు; పరిశుద్ధ గ్రంథం ఆయన మోకాలిమీద, తెరిచే ఉంది.

“నాకు కూడా అలాటి అలౌకిక ఘటన ఒకటి చూసే భాగ్యం కలిగింది,” అన్నారు మా గురుదేవులు చివరికి, గంభీర భావయుక్తంగా. “లాహిరీ మహాశయులు, నా స్నేహితుణ్ణి ఒకణ్ణి, చచ్చిపోయిన తరవాత మళ్ళీ బతికించారు.”

నా పక్కనున్న కుర్రవాళ్ళు గాఢమైన ఆసక్తి తో చిరునవ్వు నవ్వారు. ప్రత్యేకంగా గురుదేవుల వేదాంతం ఒకటే కాకుండా, ఆయన తమ గురువుగారి దగ్గర పొందిన అద్భుతమైన అనుభవాల్ని గురించిన ఏ కథ అయినా సరే, శ్రీయుక్తేశ్వర్ గారి చేత చెప్పించుకుని, విని ఆనందించడానికి నాలో కూడా కుర్రతనపు కోరిక ఇంకా తొంగి చూస్తూనే ఉంది.

“నా స్నేహితుడు రాముడూ, నేనూ ఒకరిని విడిచి ఒకరం ఉండే వాళ్ళం కాము,” అంటూ మొదలుపెట్టారు గురుదేవులు. “అతను సిగ్గరీ, ఒంటరితనం కోరేవాడు కావడంవల్ల, పగటి శిష్యబృందం ఉండని నడిరాత్రికి వేకువకూ మధ్య మా సమయంలోనే గురువుగారు - లాహిరీ మహాశయుల్ని దర్శించడానికి వస్తూండేవాడు. నేమ రాముడికి ప్రాణ స్నేహితుణ్ణి కావడంచేత, తన గాఢమైన ఆధ్యాత్మికానుభవాల్ని చాలామట్టుకు నాకు చెబుతూ ఉండేవాడు. ఆదర్శవంతమైన అతని సాంగత్యంలో