పుట:Oka-Yogi-Atmakatha.pdf/548

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

512

ఒక యోగి ఆత్మకథ

నాకు ఉత్తేజం కలిగింది.” మా గురుదేవుల ముఖం పాత జ్ఞాపకాలతో మార్దవమయింది.

“రాముడికి అకస్మాత్తుగా తీవ్రమైన పరీక్ష పెట్టడం జరిగింది,” అంటూ చెప్పారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “అతనికి ఏషియాటిక్ కలరా జబ్బు వచ్చింది. జబ్బు తీవ్రంగా ఉన్న సమయాల్లో వైద్యుల సేవ పొందడానికి మా గురువుగారు ఎన్నడూ అభ్యంతర పెట్టలేదు కాబట్టి, ఇద్దరు ప్రత్యేక వైద్యనిపుణులను పిలవడం జరిగింది. జబ్బు మనిషికి ఆదరా బాదరాగా ఉపచారం చేస్తున్న సమయంలో, లాహిరీ మహాశయుల్ని సహాయం చెయ్యమని గాఢంగా ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. ఆయన ఇంటికి ఉరికి, ఏడుస్తూ పరిస్థితి విన్నవించాను.

“ ‘రాముణ్ణి డాక్టర్లు చూస్తున్నారు గదా, బాగవుతాడు.’ అంటూ మా గురువుగారు కులాసాగా చిరునవ్వు నవ్వారు.”

“గుండె తేలికపడి, నేను తిరిగి మా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూసేసరికి, అతను కొనఊపిరితో ఉన్నాడు.”

“ ‘గంటా రెండుగంటలకన్న బతకడు’ అన్నాడొక వైద్యుడు నాతో, నిస్పృహ వ్యక్తం చేస్తూ. మళ్ళీ లాహిరీ మహాశయుల దగ్గరికి పరిగెత్తాను.

“ ‘వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు, రాముడు బాగవుతాడని నా నమ్మకం.’ గురువుగారు కులాసాగా పంపించేశారు నన్ను.

“నేను రాముడిదగ్గరికి తిరిగి వెళ్ళేసరికి, అప్పటికే డాక్టర్లు వెళ్ళి పోయారు. వాళ్ళలో ఒకాయన నా కో చీటి రాసి పెట్టాడు: ‘మాకు చేత నయినంతా చేశాం; కాని ఇతని పరిస్థితి ఆశాజనకంగా లేదు.’ ”