పుట:Oka-Yogi-Atmakatha.pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూజ్యమాతతో సమావేశం

499

ప్రయాణికులూ హడావిడిగా బండిలోకి ఎగబడి, వాళ్ళవాళ్ళ స్థానాల్లోకి వచ్చి పడ్డారు. బండి ఎలా బయలుదేరిందో తెలియకపోవడం అటుంచి, అసలు మొదట ఎందుకు ఆగిందో కూడా తెలియలేదు.

కాశీలో లాహిరీ మహాశయుల ఇంటికి చేరి, నిశ్శబ్దంగా గురువుగారి ముందు మోకరిల్లి, ఆయన పాదాలు పట్టుకోడానికి ప్రయత్నించింది అభయ.

“ ‘మనసు కుదుట బరుచుకో, అభయా,’ అన్నారాయన. ‘నన్ను ఇబ్బంది పెట్టడం నీ కెంత ఇష్టం! తరవాతి బండిలో రాలేకపోదువనా!’ ”

అభయ, చిరస్మరణీయమైన మరో సందర్భంలో లాహిరీ మహాశయుల్ని దర్శించింది. ఈసారి ఆయన సహాయం కావలసింది ట్రెయిను గురించి కాదు, సంతానం గురించి.

“నా తొమ్మిదో సంతానం బతికి బట్టకట్టేలా మీరు దీవించాలని నా ప్రార్థన. ఎనమండుగురు పిల్లలు పుట్టారు నాకు; అందరూ పుట్టగానే జారి పోయారు.” అన్నదామె.

గురువుగారు సానుభూతితో చిన్నగా నవ్వారు. “ఈసారి పుట్టబోయే సంతానం బతుకుతుంది. నేను చేసే సూచనలు శ్రద్ధగా పాటించు. ఆడపిల్ల పుడుతుంది, రాత్రిపూట. తెల్లారేదాకా చమురుదీపం వెలుగుతూండేలా చూసుకో, నిద్రపోతూ దీపాన్ని కొండెక్క నివ్వకు.”

అభయకు ఆడపిల్ల పుట్టింది; రాత్రిపూటే; సర్వద్రష్టలైన గురుదేవులు ముందుగా గ్రహించి చెప్పినట్టే, కచ్చితంగా, దీపంలో చమురు నింపుతూ ఉండమని ఆ తల్లి దాదికి పురమాయించింది. ఆ ఆడవాళ్ళిద్దరూ కంటికి కునుకురాకుండా తెల్లారగట్ల దాకా మేలుకునే ఉన్నారు; కాని చివరికి నిద్రపోయారు. దీపం దాదాపు కొండెక్కే స్థితికి వచ్చింది; వెలుగు సన్నగా అల్లల్లాడుతోంది. ఇంతలో, పడగ్గది తలుపు పెద్ద చప్పుడు చేస్తూ