పుట:Oka-Yogi-Atmakatha.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

500

ఒక యోగి ఆత్మకథ

గభాలున తెరుచుకుంది. ఆడవాళ్ళు అదిరిపడి మేలుకున్నారు. ఎదురుగా లాహిరీ మహాశయుల రూపం చూసి ఆశ్చర్యపోయారు.

“అభయా, చూడు, కొంచెం ఉంటే దీపం కొండెక్కేదే!” అంటూ ఆయన దీపం వేపు చూపించేసరికి, చమురు పొయ్యడానికి దాదీ చటుక్కున లేచింది. దీపం మళ్ళీ నిండుగా వెలిగిన తరవాత గురుదేవులు అదృశ్యమయారు. తలుపు మూసుకుంది. కంటి కవుపడే సాధనం ఏదీ లేకుండానే గడియ పడింది.

అభయ తొమ్మిదో సంతానం బతికింది; 1935 లో నేను వాకబు చేసేనాటికి ఆమె కులాసాగానే ఉంది.

లాహిరీ మహాశయుల శిష్యుల్లో, పూజ్యులు కాశీకుమార్ రాయ్‌గారు, గురుదేవుల సన్నిధిలో తాము గడిపిన జీవితాన్ని గురించి మనోహరమైన వివరాలు నాకు అనేకం చెప్పారు.

“కాశీలో, వారింట్లో నేను తరచు, వరసగా వారాల తరబడి అతిథిగా ఉండేవాణ్ణి,” అన్నారు రాయ్‌గారు. “చాలామంది. సాధు సజ్జనులూ దండిస్వాములూ[1] మా గురుదేవుల పాదసన్నిధిని కూర్చోడానికి ప్రశాంతమైన రాత్రివేళ వస్తూండేవారు. ఒక్కొక్కప్పుడు వారు, ధ్యానానికి వేదాంతానికి సంబంధించిన విషయాలు ముచ్చటించుకుంటూ ఉండేవారు. తెల్లారగట్ల మళ్ళీ వెళ్ళిపోయేవారు, ఈ మాన్య అతిథులు. నేను అన్ని సార్లు వారింటికి వెళ్ళానుకాని, ఒక్కసారి కూడా వారు నడుము వాల్చడం చూడలేదు.”

  1. బ్రహ్మదండ సూచకంగా చేతిలో ఒక వెదురు కర్రను సాంప్రదాయికంగా తీసుకువెళ్ళే ఒక సాధువర్గంతో సభ్యులు, మనిషిలోని వెనుబామును బ్రహ్మదండంగా భావిస్తారు. నిద్రాణమైన ఏడు మేదోకశేరు కేంద్రాల్ని మేల్కొలిపి ఉత్తేజితపరచటాన్నే, భగవంతుని చేరే నిజమైన మార్గంగా పరిగణిస్తారు.