పుట:Oka-Yogi-Atmakatha.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా అమ్మ మరణం, విచిత్రమైన రక్షరేకు

31

దాన్ని నీ రెండో కొడుకు చేతికి ఇమ్మని తప్పకుండా చెప్పాలి. ఆ రక్ష రేకుకు అర్థమేమిటో, మహాగురువుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది. అతడు ఈ ప్రాపంచికమైన ఆశలన్నిటినీ విడిచిపెట్టేసి ఈశ్వరుడికోసం గాఢంగా అన్వేషణ ఆరంభించే సమయంలో అతని చేతికి అది అందాలి. కొన్నేళ్ళపాటు అతడు దాన్ని అట్టే పెట్టుకున్నాక - దాని ప్రయోజనం నెరవేరిన తరవాత- అది మాయమైపోతుంది. అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచిపెట్టినప్పటికీ అది ఎక్కణ్ణించి వచ్చిందో అక్కడికి పోయి తీరవలసిందే.”

“ఆయనకు నేను భిక్ష[1] వెయ్యబోయాను; ఎంతో గౌరవ ప్రపత్తులతో ఆయనకు ప్రణామం చేశాను. కాని ఆయన భిక్ష తీసుకోకుండానే, దీవించి వెళ్ళిపోయాడు. మర్నాటి సాయంత్రం నేను చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా, ఆ సాధువు చెప్పినట్టే, నా అరచేతులు రెంటికీ మధ్య రక్షరేకు వెలిసింది. నా చేతులకది చల్లగా, నున్నగా తగలబట్టే ఆ సంగతి తెలిసింది. రెండేళ్ళకు పైగా నేను దాన్ని బహుజాగ్రత్తగా దాచాను. ఇప్పుడిక అనంతుడి దగ్గర ఉంది. నా గురుదేవులు నన్ను పరమాత్ముడి చేతుల్లో పెట్టబోతున్నారు; కనక, నా కోసం నువ్వు బాధపడకు నాయనా, వెళ్ళొస్తాను. జగన్మాత నిన్ను కాపాడుతుంది.”

ఆ రక్షరేకు నా అధీనంలోకి రావడంతోనే ఒకానొక తేజపుంజం నా మీదికి ప్రసరించింది; అణగిఉన్న జ్ఞాపకాలెన్నో నాలో మేల్కొన్నాయి. ఆ రక్షరేకు గుండ్రంగా, ప్రాచీనకాలంనాటిదిగా చిత్రంగా ఉంది. దానినిండా సంస్కృత లిపిలో ఏవో అక్షరాలున్నాయి. తాము అదృశ్యంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తూఉన్న నా పూర్వజన్మల గురువుల దగ్గరినుంచి అది వచ్చిందని గ్రహించాను. వాస్తవానికి, దానికి


  1. సాధువులకు సాంప్రదాయికంగా, గౌరవభావంతో సమర్పించేది.