పుట:Oka-Yogi-Atmakatha.pdf/513

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలౌకిక ఘటనల నియమం

477

ప్రపంచంలో మనం, పరిచిత జీవిత నాటకం తాలూకు ఛాయాచిత్ర ప్రదర్శనను గమనిస్తాం. ఛాయారూపమైన నా చేతిముడుసు, ఛాయారూపమైన టేబిలు మీద ఆనుకుని ఉండగా, ఛాయారూపమైన సిరా, ఛాయారూపమైన కాయితం మీద ప్రవహిస్తూ ఉంటుంది. ఇదంతా ప్రతీకాత్మకం; ప్రతీకగానే విడిచిపెడతాడు దాన్ని, భౌతికశాస్త్రజ్ఞుడు. తరవాత వస్తాడు, మనస్సనే రసవాది; ఈ ప్రతీకల్ని అతను రూపాంతరణ చేస్తాడు. ...చివరికి స్థూలంగా చెప్పాలంటే, “ప్రపంచ మూలద్రవ్యం మనోద్రవ్యమే!”

ఇటీవల ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ (ఋణవిద్యుదణు సూక్ష్మదర్శిని) రూపొందించిన మీదట, అణువులకు సారభూతమయిన కాంతికీ ప్రకృతికి అనివార్యమైన ద్వంద్వతకూ నిశ్చితమైన నిదర్శనం లభించింది. 1937లో, అమెరికన్ ఎసోసియేషన్ ఫర్ ది ఎడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ అన్న సంస్థవారి సమావేశంలో జరిగిన, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ప్రయోగ ప్రదర్శనను గురించి ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఇలా రాసింది:

“ఇంతవరకు పరోక్షంగా ఎక్స్‌రేలనే కిరణాల ద్వారా మాత్రమే తెలిసిన, టంగ్‌స్టన్ స్ఫటికాకృతి, ఒక ఫ్లోరసెంట్ స్క్రీన్ (వెల్తురు తెర) మీద స్ఫుటంగా నిలిచింది. ఘనాకారం గల అంతరజాలకం (స్పేస్ లాటిస్) లో తొమ్మిది అణువులు వాటివాటి సరైన స్థానాల్లో ఉన్నాయి; అంటే, ఒక్కొక్క మూల ఒక్కొక్క అణువు చొప్పున, మధ్య మరొకటి, టాగ్‌స్టన్ స్ఫటిక జాలకంలోని అణువులు వెల్తురు తెరమీద, జ్యామితీయమైన నమూనాలో అమర్చిన కాంతి బిందువులుగా పొడగట్టాయి. స్ఫటిక ఘనరూపమైన కాంతిలో తాడనంచేస్తున్న గాలి సూక్ష్మ కణాల్ని, నర్తిస్తున్న కాంతి బిందువులుగా గమనించవచ్చు, కదులుతున్న నీటిమీద మిలమిల మెరిసే సూర్యకాంతి బిందువుల్ని పోలి ఉంటాయి ఇవి.