పుట:Oka-Yogi-Atmakatha.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రవీంద్రనాథ్ టాగూరు, నేను విద్యాలయాల్ని పోల్చిచూడడం

465

అంటే, నీ ప్రేమదీపాన్ని వెలిగించు! అంటూ పాడడం మొదలు పెట్టాను. భోలా నేనూ ఆనందంగా పాడుకుంటూ విద్యాలయ రూముల్లో విహరించాం.

రాంచీ విద్యాలయాన్ని స్థాపించిన రెండేళ్ళకి, రవీంద్రుల దగ్గర్నించి నాకొక ఆహ్వానం వచ్చింది; మా విద్యాబోధనాదర్శాల్ని కలిసి ముచ్చటించుకోడానికి నన్ను శాంతినికేతనానికి వచ్చి కలుసుకోమని కోరారు. నేను సంతోషంగా వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఆ మహాకవి తమ పఠన మందిరంలో కూర్చుని ఉన్నారు. మేము మొట్టమొదట కలుసుకున్నప్పుడు అనిపించినట్టే ఇప్పుడు కూడా, ఆయన రూపం, ఏ చిత్రకారుడయినా ఉత్తమ పురుషాకృతిని చిత్రించడానికి ఆదర్శంగా కోరేటంత ప్రస్ఫుటంగా ఉందని అనిపించింది. కులీనత ఉట్టిపడే విధంగా, శిల్పకారుడు తీర్చి దిద్ది నట్టున్న ముఖానికి చుట్టూ పొడుగాటి జుట్టు, వంకులు వంకుల గడ్డమూ ఉన్నాయి. విశాలమైన దయార్ద్రనేత్రాలూ, దివ్యదరహాసమూ; అక్షరాలా సమ్మోహపరచే వేణునాదం వంటి కంఠస్వరమూ. దృఢంగాను, నిటారుగాను, గంభీరంగాను ఉండే ఆయన రూపం, దాదాపు స్త్రీసహజమైన మార్దవాన్నీ శిశుసహజమైన ఆనందమయ స్వచ్ఛందతనూ మేళవించినట్టు ఉంది. కవిని గురించిన ఏ ఆదర్శభావనా, ఈ సౌమ్య గాయకునిలో కంటె మరెవరిలోనూ సముచితంగా రూపుగట్టలేదు.

కాస్సేపట్లో టాగూరుగారూ నేనూ, ఛాందసానికి తావులేని ఆదర్శాలతో స్థాపించిన మా విద్యాలయాల్ని ఒక దాంతో ఒకటి పోల్చి పరిశీలించడంలో మునిగిపోయాం. ఆరుబయట చదువు చెప్పడం, నిరాడంబరత, కుర్రవాడి సృజనశీలతకు సమృద్ధిగా అవకాశం కల్పించడం వంటి సమాన లక్షణాలు చాలా ఉన్నట్టు కనిపెట్టాం. అయితే రవీంద్రులు, సాహిత్య, కవిత్వ అధ్యయనానికి, భోలా విషయంలో వెనక నేను గమనించినట్టుగా సంగీతంద్వారానూ గానంద్వారానూ ఆత్మాభివ్యక్తికి చెప్పుకోదగినంత