పుట:Oka-Yogi-Atmakatha.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

466

ఒక యోగి ఆత్మకథ

ప్రాముఖ్యం ఇచ్చారు. శాంతినికేతన విద్యార్థులు మౌనకాలాలు పాటించడం మట్టుకు జరుగుతోంది కాని, వాళ్ళకి ప్రత్యేక యోగాభ్యాసం ఏదీ నేర్పడం లేదు.

రాంచీలో విద్యార్థులందరికీ నేర్పే శక్తిసంవర్ధక “యోగదా” అభ్యాసాలగురించి, యోగధారణ పద్ధతుల గురించి నేను వివరిస్తుంటే ఆ మహాకవి, ప్రశంసాసూచకమైన శ్రద్ధతో విన్నారు.

టాగూరుగారు, చిన్నప్పటి తమ చదువులో ఎదురైన సంఘర్షణను గురించి నాకు చెప్పారు. “ఐదో తరగతి తరవాత నేను బళ్ళోంచి పారిపోయాను,” అంటూ నవ్వుతూ చెప్పారు. ఈయనకు జన్మసిద్ధంగా వచ్చిన, కవిసహజమైన కోమలత్వానికీ, నిస్సారమూ నిరంకుశమూ అయిన పాఠశాల వాతావరణానికి ఎలాగూ సరిపడదన్న సంగతి వెంటనే అర్థంచేసుకున్నాను.

“అంచేతే నేను, నీడనిచ్చే చెట్లకింద, విశాలాకాశం కింద శాంతి నికేతనం స్థాపించాను.” అందమైన తోటలో చదువుకుంటున్న చిన్న పిల్లలగుంపు వేపు చూపించారాయన.

“పిల్లవాడు పువ్వుల మధ్యా పాటలు పాడే పక్షుల మధ్యా తన సహజ వాతావరణంలో ఉంటాడు. అక్కడే వాడు తన వ్యక్తిగత ప్రతిభ తాలూకు గుప్త సంపదను మరింత సులువుగా వ్యక్తం చెయ్యవచ్చు. నిజమైన విద్యాబోధన, లోపల ఉన్న అనంత జ్ఞాననిధిని బయటికి తీసుకు రావడానికి సాయపడుతుందే కాని, బయటి వనరుల నుంచి లోపలికి ఎక్కించి దట్టించడం జరగదు.”

దాంతో నేను ఏకీభవిస్తూ, “మామూలు బళ్ళలో, గణాంక వివరాలూ చారిత్రకయుగాలు వంటి ప్రత్యేక సత్యాలవల్ల, కుర్రవాళ్ళకుండే ఆదర్శా