పుట:Oka-Yogi-Atmakatha.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

456

ఒక యోగి ఆత్మకథ

చూసిన మొదటి వ్యక్తులు కాశీ తండ్రి, ఇతర బంధువులూ; వాళ్ళు సంతాపసూచకమైన బట్టలు కట్టుకొని ఉన్నారు. మా బండివాణ్ణి ఆపమని అరిచి, గబుక్కున బండిలోంచి ఉరికి, అభాగ్యుడైన ఆ తండ్రివేపు తేరిపార చూశాను.

“హంతక మహాశయా, నా కుర్రవాణ్ణి చంపేశారు మీరు!” అంటూ కొంతమట్టుకు అనుచితంగానే అరిచాను.

కాశీని బలవంతంగా కలకత్తాకు తీసుకువచ్చి తప్పు చేశానని అప్పటికే గ్రహించాడు ఆ తండ్రి. అక్కడున్న కొద్ది రోజుల్లోనూ ఆ అబ్బాయి, కలుషితమైన ఆహారం తిని, కలరా వచ్చి చనిపోయాడు.

కాశీ మీద నాకున్న వాత్సల్యమూ, పోయిన తరవాత మళ్ళీ అతన్ని కనుక్కుంటానని చేసిన వాగ్దానమూ నన్ను రాత్రింబగళ్ళు వెంటాడుతున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, అతని ముఖం నా కళ్ళముందు ఆడుతూనే ఉంది. పోయిన మా అమ్మకోసం, చాలాకాలం కిందట ఎలా అన్వేషించానో అలాగే అతని కోసంకూడా చిరస్మరణీయమైన అన్వేషణ మొదలుపెట్టాను.

భగవంతుడు నాకు వివేచన శక్తి ఇచ్చినందుకు దాన్ని నేను తప్పకుండా వినియోగించాలనీ, ఆ అబ్బాయి సూక్ష్మశరీరం ఉనికిని తెలుసుకోడానికి వీలైన సూక్ష్మ నియమాల్ని కనిపెట్టడానికి నాకుగల శక్తుల్ని సంపూర్ణంగా కూడగట్టుకొని అందుకు శ్రమించాలని అనిపించింది. అతను తీరని కోరికలతో స్పందిస్తున్న ఆత్మ; సూక్ష్మ మండలాల్లో అనేక లక్షల ప్రకాశమానమైన ఆత్మల మధ్య ఎక్కడో ఒక కాంతిపుంజంగా తేలుతున్నాడని గ్రహించాను. స్పందనశీల కాంతుల రూపంలో ఉన్న అనేక ఇతర ఆత్మలతో కూడి ఉన్న అతనితో సంపర్కం పెట్టుకోడం ఎలాగ?