పుట:Oka-Yogi-Atmakatha.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశీ పునర్జన్మ, వెల్లడి

457

ఒక రహస్య యోగప్రక్రియను ఉపయోగించి, నా కనుబొమల మధ్య అంతర్బిందువయిన ఆధ్యాత్మిక నేత్రమనే “మైక్రోఫోన్” ద్వారా, కాశీ ఆత్మకు నా ప్రేమను ప్రసారం చేశాను. అతను ఈపాటికి ఏ తల్లి గర్భంలోనో పిండంగా శరీరధారణ చేసి ఉంటాడన్న నమ్మకం నాకు కలిగింది; అందుచేత అతనున్న స్థలం ఏ దిశగా ఉందో గుర్తించడానికని, పైకెత్తిన నా చేతుల్నీ వేళ్ళనీ గ్రాహకాలు (ఆంటినాలు)గా ఉపయోగిస్తూ తరచు నేను, గుండ్రంగా తిరుగుతూ ఉండేవాణ్ణి. ఏకాగ్రతా సంధానితమైన నా హృదయమనే[1] రేడియోలో, అతనినుంచి వచ్చే ప్రతిస్పందనను అందుకోవాలని ఆశించాను.

కాశీ త్వరలోనే భూమికి తిరిగివస్తాడనీ, నేను కనక అవిచ్ఛిన్నంగా అతనికి నా పిలుపును ప్రసారం చేసినట్లయితే అతని ఆత్మ జవాబు ఇస్తుందనీ సహజావబోధాత్మకమయిన అనుభూతి పొందాను. కాశీ పంపించే అత్యల్ప ఆవేగాన్ని నా వేళ్ళలోనూ ముంజేతుల్లోనూ చేతుల్లోనూ వెన్నులోనూ నరాల్లోనూ అనుభూతం చేసుకోవచ్చునని నాకు తెలుసు.

కాశీ చనిపోయిన తరవాత ఆరు నెలలపాటు నే నీ యోగ ప్రక్రియను తరగని ఉత్సాహంతో నిలకడగా సాధన చేశాను. ఒకనాడు పొద్దున,

  1. కనుబొమల మధ్య ఉండే బిందువునుంచి ప్రతిక్షేపించిన సంకల్పశక్తి, ఆలోచనను ప్రసారంచేసే పరికరమన్న సంగతి యోగులకు తెలుసు. అనుభూతి హృదయంమీద ప్రశాంతంగా కేంద్రీకృతమైనప్పుడు, అది మానసికమైన రేడియోగా పని చేస్తుంది; అంతే కాకుండా, దూరంలోకాని దగ్గరలోకాని ఉన్న వాళ్ళ సందేశాల్ని అందుకోగలుగుతుంది. మానసిక ప్రసారంలో (టెలిపతీ), ఒక వ్యక్తి మనస్సులో ఉన్న సున్నితమైన ఆలోచనాస్పందనలు మొదట, మహాకాశ సూక్ష్మ స్పందనల ద్వారానూ ఆ తరవాత స్థూలతరమైన భౌతికాకాశం ద్వారానూ, విద్యుత్ తరంగాల్ని సృష్టిస్తూ పరిచాలితమవుతాయి; ఆ విద్యుత్ తరంగాలు, వాటంతట అవి, మరో వ్యక్తి మనస్సులో ఆలోచనగా రూపాంతరంచెందుతాయి.