పుట:Oka-Yogi-Atmakatha.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాంచీలో యోగవిద్యాలయ స్థాపన

443

కాని, అన్నదమ్ముల్నికాని, అక్కచెల్లెళ్ళనికాని, తండ్రినికాని, తల్లినికాని, భార్యనుకాని, పిల్లల్నికాని, భూముల్ని కాని విడిచిపెట్టినవాడూ ఈ లోకంలో హింసలకు గురికావడంతోబాటు, ఇప్పుడు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెళ్ళని, తల్లుల్ని, పిల్లల్ని, భూముల్ని, పరలోకంలో నిత్యజీవితాన్ని పొందనివాడూ లేడన్నది నిశ్చయం."[1]

ఈ మాటలకు శ్రీయుక్తేశ్వర్‌గారు ఇలా వ్యాఖ్యానం చెప్పారు: “సమష్టిగా సమాజం (“ఇప్పుడు నూరంతలుగా ఇండ్లను, అన్న దమ్ముల్ని”) పట్ల గురుతరమైన బాధ్యత వహించడంకోసం, పెళ్ళీ కుటుంబపోషణా వంటి మామూలు జీవితానుభవాల్ని వదులుకొనే భక్తుడు, అపార్థం చేసుకునే తత్త్వంగల ప్రపంచం పెట్టే హింసలకు తరచుగా గురి అయ్యే అవకాశం గల పని చేస్తుంటాడు. అటువంటి గురుతర బాధ్యతల స్వీకారం వల్ల భక్తుడు స్వార్థాన్ని జయించి దైవకృపకు పాత్రుడవుతాడు.”

ఒకనాడు మా నాన్నగారు, వాత్సల్యంతో ఆశీర్వదించి వెళ్ళడానికి రాంచీకి వచ్చారు; బెంగాల్ - నాగపూర్ రైల్వేలో ఆయన ఇప్పించదలచిన ఉద్యోగాన్ని నేను తిరస్కరించి ఆయన్ని నొప్పించినందువల్ల, చాలా కాలంగా ఆ ఆశీర్వాదం నాకు అందకుండా ఉంచారు.

“అబ్బాయి! నువ్వెంచుకున్న నీ జీవితమార్గానికి నే నిప్పుడు సమాధానపడ్డాను. హాయిగా, ఉత్సాహంగా ఉన్న కుర్రవాళ్ళ మధ్య నిన్ను చూస్తుంటే నాకు సంతోషం కలుగుతోంది. నిర్జీవమైన రైల్వే టైమ్ టేబుళ్ళ లెక్కల్లోకన్న ఇక్కడే ఉంది నీ అసలయిన స్థానం.” నా వెంట ఉన్న పన్నెండుమంది పిల్లలవేపు చెయ్యి ఊపారాయన. “నాకున్న


  1. మార్కు 10 : 29-30 (బైబిలు).