పుట:Oka-Yogi-Atmakatha.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

442

ఒక యోగి ఆత్మకథ

చూపారు; ప్రాణశక్తిని శరీరంలో ఒక భాగం నుంచి మరో భాగానికి మార్చడానికి, కష్టసాధ్యమైన ఆసనాల్లో సుస్థిరంగా కూర్చోడానికి కావలసిన అసాధారణ సామర్థ్యం పెంపొందించుకున్నారు. శక్తిసంపన్నులైన అనేకమంది వయోజనులు కూడా తమకు సాటిరానంతగా, శారీరక బలానికి సహనశక్తికి సంబంధించిన అసాధారణ కృత్యాలు ప్రదర్శించారు.

మా చిన్నతమ్ముడు విష్ణుచరణ్ ఘోష్[1] రాంచీ విద్యాలయంలో చేరాడు. ఉత్తరోత్తరా అతను, ప్రసిద్ధ వ్యాయామశాస్త్రజ్ఞుడయాడు. అతనూ అతని శిష్యుల్లో ఒకడూ కలిసి 1938-39 లో, పాశ్చాత్య దేశాల్లో పర్యటిస్తూ బలాన్నీ కండరాల నియంత్రణనూ నిరూపించే ప్రదర్శనలు ఇచ్చారు. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయం, అమెరికా యూరప్‌లలోని ఇతర విశ్వవిద్యాలయాల ఆచార్యులు, శరీరంమీద మనస్సుకు గల ప్రాబల్యాన్ని నిరూపించే, వీరి ప్రదర్శనలు చూసి చకితులయారు.

రాంచీలో మొదటి సంవత్సరం ముగిసేనాటికి, విద్యాలయంలో చేరడానికి వచ్చినవాళ్ళ దరఖాస్తుల సంఖ్య రెండు వేలకు పెరిగింది. కాని అప్పటికి కేవలం ఆశ్రమ విద్యాలయంగా మాత్రమే ఉన్న ఆ పాఠశాల వందమందికే వసతి కల్పించగలిగింది, పగటిపూట వచ్చే విద్యార్థులకు కూడా త్వరలోనే బోధనకు ఏర్పాట్లుచేయడం జరిగింది.

విద్యాలయంలో నేను, చిన్నపిల్లలకు తల్లిగానూ తండ్రిగానూ కూడా వ్యవహరించవలసి వచ్చేది; దాంతో బాటు వ్యవస్థాపరమైన ఇబ్బందులకు కూడా చాలావాటికి తట్టుకోవలసి వచ్చేది. క్రీస్తు మాటలు నాకు తరచుగా గుర్తొస్తూ ఉండేవి: “నా కోసమూ సువార్త కోసమూ ఇంటిని


  1. విష్ణుచరణ్ ఘోష్, 1970 జూలై 9 న కలకత్తాలో చనిపోయారు (ప్రచురణకర్త గమనిక).