పుట:Oka-Yogi-Atmakatha.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను సన్యాసం తీసుకోడం

403

ప్రవాహాలను అదుపులో ఉంచుకోడం); (5) ప్రత్యాహారం (జ్ఞానేంద్రియాల్ని బయటి వస్తువుల మీంచి వెనక్కి మళ్ళించుకోడం).

చివరి మెట్లు అసలు యోగం కిందికివచ్చే అంగాలు: (6) ధారణ (ఏకాగ్రత), మనస్సును ఒకే ఆలోచనమీద నిలిపి ఉంచడం; (7) ధ్యానం (దైవచింతన), (8) సమాధి (అధిచేతనానుభవం). ఈ అష్టాంగ యోగ మార్గం,[1] అంతిమ లక్ష్యమైన కైవల్యానికి చేరుస్తుంది; అందులో యోగి, బుద్ధిగ్రాహ్యతకు అతీతంగా ఉండే సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు.

‘‘ఎవరు గొప్ప? స్వామా, యోగా?” అని ఎవరయినా అడగవచ్చు. దేవుడితో ఐక్యాన్ని సాధిస్తే, వివిధ మార్గవిభేదాలు వెంటనే అదృశ్యమవుతాయి. అయితే ‘భగవద్గీత’ మాత్రం, యోగంలోని పద్ధతులు సర్వాంగీణమైనవని చెబుతుంది. వీటి ప్రక్రియలు, సన్యాసజీవితం వేపు మొగ్గుచూపే ఏ కొద్దిమంది మాదిరిగానో కేవలం కొన్ని తరహాల మనుషుల కోసం, కొన్ని మనస్తత్వాల మనుషులకోసం ఉద్దేశించినవి కావు; సాధకుడు ఏదో ఒక విశిష్ట సంప్రదాయానికి బద్ధుడై ఉండవలసిన ఆవశ్యకత యోగంలో లేదు. యోగశాస్త్రం విశ్వజనీనమైన ఆవశ్యకతను నెరవేరుస్తుంది కాబట్టి దానికి సహజమైన విశ్వజనీన ఆకర్షణ ఉంది. నిజమైన యోగి ప్రపంచంలో విధివిధేయుడయి ఉండిపోవచ్చు; అక్కడ అతను

  1. మానవ ప్రవర్తనను చక్కదిద్దడానికి బౌద్ధమతంలో ఏర్పడ్డ “అష్టాంగ మార్గం” దీనికి భిన్నంగా, ఇలా ఉంది. (1) సరయిన ఆదర్శాలు (సమ్యగ్దృష్టి ), (2) సరయిన ఉద్దేశ్యం (సమ్యక్ సంకల్పం), (3) సరయిన మాట (సమ్యక్ వాక్కు), (4) సరయిన చేత (సమ్యక్ కర్మ) (5) సరయిన బతుకు తెరువు (సమ్యక్ ఆజీవిక); (6) సరయిన కృషి (సమ్యక్ వ్యాయామం), (7) (ఆత్మను గురించి) సరయిన జ్ఞాపకం (సమ్యక్ స్మృతి), (8) సరయిన సాక్షాత్కారం (సమ్యక్ సమాధి).