పుట:Oka-Yogi-Atmakatha.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

404

ఒక యోగి ఆత్మకథ

నీటిమీద వెన్నముద్ద లాంటివాడు; అంతేకాని, క్రమశిక్షణలేని మానవ సముదాయం మాదిరిగా, గిలకొట్టకుండా ఉంచిన, ఇట్టే నీళ్ళు కలపడానికి వీలయిన పాలవంటివాడు కాదు. మానవుడు, అహంకార జన్యమైన వాంఛల పట్ల మానసికమైన అనాసక్తిని నిలుపుకొంటూ, దైవనిర్ణీతమైన ఉపకరణంగా సౌముఖ్యంతో, జీవితంలో తన పాత్రను తాను నిర్వహిస్తూ ఉన్నట్లయితే, లౌకిక బాధ్యతలు నెరవేర్చడమన్నది మనిషిని దేవుణ్ణించి దూరం చెయ్యనక్కరలేదు. అయితే అందుకు మనిషి మానసికంగా, అహంకార జనితమైన కోరికల్లో చిక్కుకొని ఉండకుండా, తనను దేవుడి ఉపకరణంగా మనసారా భావించుకొంటూ జీవితంలో తన పాత్ర నిర్వహించాలి.

ఈనాడు అమెరికన్, యూరోపియన్, లేదా హైందవేతర దేశాల్లో జీవిస్తున్న మహాపురుషులు ఎందరో ఉన్నారు; వీరు ‘యోగి’, ‘స్వామి’ అన్న మాటలు సైతం ఎన్నడూ విని ఉండకపోయినప్పటికీ, ఆ పదాలకు నిదర్శనంగా నిలిచే ఆదర్శప్రాయులు. మానవజాతికి తాము చేసిన నిస్స్వార్థ సేవవల్లనయితే నేమి, కామవాసనల్నీ ఆలోచనల్నీ అదుపులో ఉంచుకోడంవల్లనయితే నేమి, ఏకోన్ముఖమైన దైవప్రేమవల్ల నయితే నేమి, మహత్తరమైన ఏకాగ్రతాసాధనశక్తులవల్లనయితేనేమి, వీరంతా ఒక విధంగా యోగులే; యోగలక్ష్యాన్ని - ఆత్మనిగ్రహాన్ని నిలుపుకొన్నవారు. వీరికి కనక, మనస్సునూ జీవితాన్నీ ఇప్పటికన్న ఉద్దిష్టమార్గంలో నడిపించగల యోగమనే నిర్దిష్ట శాస్త్రాన్ని బోధించినట్లయితే ఇంకా ఉన్నత స్థితుల్ని అందుకోగలుగుతారు.

పాశ్చాత్య రచయితలు కొందరు, యోగశాస్త్రాన్ని పైపైని తడిమి తప్పుగా అర్థం చేసుకున్నారు. కాని అటువంటి విమర్శకులెన్నడూ దాన్ని సాధన చేసినవాళ్ళు కారు. యోగశాస్త్రానికి వివేకవంతమయిన నివాళులర్పించినవాళ్ళలో, స్విట్జర్లాండ్ దేశపు ప్రఖ్యాత మనస్తత్త్వవేత్త