పుట:Oka-Yogi-Atmakatha.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

354

ఒక యోగి ఆత్మకథ

ఇళ్ళు, అనేక వంతెనలుగల జీలంనది, పూలు పరిచినట్టున్న గడ్డి మైదానాలు, వీటన్నిటినీ చుట్టిఉన్న హిమాలయాలూ చూడబోతున్నామన్న ఆనందం మా హృదయాల్లో నిండింది.

మేము శ్రీనగర్‌కు వెళ్ళే దారికి ఇటూఅటూ ఉన్న పొడుగాటి చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఎత్తయిన కొండల నేపథ్యంలో ఉన్న రెండతస్తుల సత్రంలో మేము గదులు తీసుకున్నాం. అక్కడ నీటి కుళాయిల సౌకర్యం లేదు; దగ్గరలో ఉన్న నూతిలోంచి నీళ్ళు తోడుకునే వాళ్ళం. వేసవి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది: వెచ్చటి పగళ్ళూ చిరుచలి రాత్రులూ.

శ్రీనగర్‌లో శంకరాచార్య స్వామివారి ప్రాచీన ఆలయానికి యాత్ర చేశాం. ఆకాశంలో ఉవ్వెత్తుగా నిలిచిన ఆ గిరిశిఖరాశ్రమం మీదికి చూపు సారించి తదేకంగా చూస్తున్నప్పుడు నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎక్కడో ఒక దూరదేశంలో కొండమీద నెలకొన్న ఒక భవనం తాలూకు దృశ్యం నాకు గోచరమయింది; శ్రీనగర్‌లో మహోన్నతంగా నెలకొన్న ఆ శంకరాచార్య ఆలయం రూపాంతరం చెందుతూ, అనేక సంవత్సరాల అనంతరం నేను అమెరికాలో స్థాపించిన సెల్ఫ్ రియలై జేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యస్థాన భవనంగా మారినట్టు దర్శనమయింది (నేను మొట్టమొదట కాలిఫోర్నియాలో లాస్‌ఏంజిలిస్‌ను సందర్శించి మౌంట్ వాషింగ్టన్ కొండ కొమ్మునున్న పెద్ద భవనాన్ని చూసినప్పుడు, అంతకుపూర్వం ఎప్పుడెప్పుడో, కాశ్మీరులోనూ ఇతర చోట్లా నాకు కలిగిన అంతర్దర్శనాన్ని బట్టి వెంటనే దాన్ని గుర్తుపట్టాను).

శ్రీనగర్‌లో కొన్నాళ్ళు ఉన్నాం; ఆ తరవాత ఎనభై ఐదు వందల అడుగుల ఎత్తున ఉన్న గుల్మార్గ్ (పూలకొండ దారులు) కు బయలుదేరాం. నేను మొట్టమొదటిసారిగా భారీ గుర్రం మీద స్వారి చేసింది అక్కడే.