పుట:Oka-Yogi-Atmakatha.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేము కాశ్మీరు వెళ్ళాం

355

రాజేంద్ర చిన్న గుర్రం ఎక్కాడు; కాని దానికి వడివడిగా పోవాలన్న ఆరాటం ఎక్కువ. చాలా నిటారుగా ఉండే ఖిలన్ మార్గ్‌లోనే పైకి పోవడానికి సాహసించాం మేము; అయితే ఆ దారి పుట్టగొడుగుచెట్లు దండిగా ఉండే దట్టమైన అడవిగుండా సాగింది; అక్కడ మంచుకప్పిన దారులు తరచు ప్రమాదకరంగా ఉంటాయి. కాని రాజేంద్రుడి చిట్టిగుర్రం, నా భారీ గుర్రానికి చాలా ప్రమాదకరమైన మలుపుల్లో కూడా, ఒక్క చిటికె సేపు విశ్రాంతి నివ్వలేదు. పోటీలో కలిగే సంబరం తప్ప మరేమీ ఎరగని రాజేంద్రుడి గుర్రం, అలుపూ సొలుపూ లేకుండా మునుముందుకు సాగుతూనే ఉంది.

హైరాణ పెట్టిన మా పందేనికి మనోహరమైన దృశ్యరూపంలో బహుమానం దొరికింది. ఈ జన్మలో మొట్టమొదటిసారిగా, హిమాచ్ఛాదిత మైన ఉత్తుంగ హిమాలయాల్ని అన్ని వేపులనుంచీ చూశాను; ధ్రువప్రాంతపు పెద్ద పెద్ద ఎలుగుబంట్ల స్థూలాకృతుల మాదిరిగా దొంతులు పేర్చినట్లు ఉన్నాయి ఆ కొండలు. సూర్యకాంతి ప్రసరించిన నీలాకాశ నేపథ్యంలో అనంతదూరాలకు వ్యాపించి ఉన్న మంచు కొండల్ని అవలోకిస్తూ ఆనందాతిరేకంతో విందులు చేసుకున్నాయి నా కళ్ళు.

తళతళలాడే మంచుకొండ వాలుల్లో, కుర్రకారు సావాసగాళ్ళతో కలిసి నేనూ ఆనందంగా దొర్లాను. మా దిగుదల ప్రయాణంలో, దూరాన విశాలమైన ఒక పసుప్పచ్చ పూల తివాసీ చూశాం; వెలవెలబోయిన కొండల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోందది.

మా విహారయాత్రల్లో ఆ తరవాత సందర్శించినవి షాజహాను చక్రవర్తి, షాలిమార్ లోనూ నిశాత్‌లోనూ నిర్మించిన ప్రఖ్యాత “విలాస ఉద్యానవనాలు.” నిశాత్ బాగ్‌లోని పురాతన భవనం, సూటిగా సహజమైన ఒక జలపాతం మీద నిర్మించినది. కొండల మీంచి ఉరకలు వేస్తూ వచ్చి