పుట:Oka-Yogi-Atmakatha.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

ఒక యోగి ఆత్మకథ

అరవిచ్చిన ఆయన కన్నులు, బయటి ప్రపంచంపట్ల ఆయనకు నామ మాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్టుగా తెలుపుతున్నాయి. అవి సగం మూసుకొని ఉడడంలో, ఆంతరికమైన ఆనందంలో మునిగి ఉండటాన్ని సూచిస్తాయి. జిజ్ఞాసువులు చాలామంది ఆయన ఔదార్యాన్ని ఆశించి వచ్చే వారు; లౌకికమైన క్షుద్ర ప్రలోభాలకు లొంగని ఆయనకు, వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్తిగా అన్ని సమయాల్లోనూ తెలిసే ఉండేవి.

గురుదేవుల పటానికున్న మహిమద్వారా స్వస్థత చేకూరిన కొన్నాళ్ళకు నాకు స్ఫూర్తిమంతమైన ఆధ్యాత్మిక దర్శనం ఒకటి కలిగింది. ఒకనాడు ఉదయం నేను పక్కమీద కూర్చుని స్వాప్నిక చింతనలో మునిగిపోయాను.

“కళ్ళు మూసుకొని ఉన్నప్పుడుండే చీకటికి వెనకాల ఉన్నది ఏమిటి?” అంటూ లోతులు తరిచే ఈ ఆలోచన నా మనస్సులో చొరబడింది. తక్షణమే నా అంతర్దృష్టిలో బ్రహ్మాండమైన మెరుపులాంటి వెలుగు ఒకటి కనిపించింది. కొండ గుహల్లో ధ్యానముద్రలో కూర్చుని ఉన్న మునుల దివ్యదేహాలు, నా నుదుటికి లోతట్టునున్న పెద్ద వెలుతురు తెరమీద చిన్న సైజు సినిమా బొమ్మల్లా రూపుగట్టాయి.

“ఎవరు మీరు?” అంటూ బిగ్గరగా అడిగాను.

“హిమాలయ యోగులం,” అన్నారు ఆ దివ్యపురుషులు. వారి సమాధాన్ని వర్ణించడం కష్టం. నా గుండె ఝల్లుమన్నది.

“హిమాలయాలకి వెళ్ళాలనీ, నేను మీ లాగే కావాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను!” ఆ దృశ్యం అదృశ్యమైంది. కాని తళతళలాడే ఆ కిరణాలు వలయాలు వలయాలుగా అనంతంగా పెరిగిపోతున్నాయి.

“అద్భుతమైన ఈ వెలుతురు ఏమిటి?”