పుట:Oka-Yogi-Atmakatha.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం

15

అన్ని జాగ్రత్తలూ తీసుకుని, ఆబగా పన్నెండు ఫొటోలు తీశాడు. అయినా తరవాత చూస్తే ప్రతి ప్లేటు మీదా కనిపించిందేమిటి? కొయ్యబల్లా, వెనకాల తెరానూ. అంటే మహాశయుల ఆకారం మాత్రం అయిపు లేదు.

ఆ అబ్బాయికి కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి; గర్వం పటాపంచలైంది. గంగాధరబాబు మళ్ళీ గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. ఎన్నో గంటలు గడిస్తేనే కాని మహాశయులు మౌనం విడవలేదు. తరవాత భావగర్భితంగా వ్యాఖ్య చేశారు:

“నేను ఆత్మస్వరూపుణ్ణి. సర్వవ్యాప్తమైన అగోచరశక్తిని నీ కెమేరా ఫొటో తియ్యగలదా?”

“తియ్యలేదని తెలుసుకున్నానండి. కాని స్వామీ, మీ శరీరాలయం ఫొటో ఒకటి కావాలని భక్తితో కోరుతున్నాను. ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది. ఆత్మశక్తి మీలో సంపూర్ణంగా ఉంటుందన్న సంగతి ఈ నాటివరకు గ్రహించలేకపోయాను.

“అయితే రేప్పొద్దున్నే రా; ఫొటో తీసుకుందువుగాని,” అన్నారు మహాశయులు.

ఫొటోగ్రాఫరు మళ్ళీ ఫోకస్ చేశాడు. కంటికి కనిపించకపోవడం మనే చిత్రమైన ముసుగులో మరుగుపడకుండానే ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫొటోలో పడింది.

ఆ ఫొటోగ్రాఫే ఈ పుస్తకంలో అచ్చువెయ్యడం జరిగింది. విశ్వజనీనమైన రూపంలో ఉండే లాహిరీ మహాశయుల సుందరమైన ఆకృతి చూస్తే ఆయన ఏ జాతివారో వెంటనే తెలియదు. దైవసంసర్గంవల్ల కలిగిన ఆనందం నిగూఢమైన ఆయన చిరునవ్వులో కొద్దిగా వ్యక్తమవుతోంది.