పుట:Oka-Yogi-Atmakatha.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

318

ఒక యోగి ఆత్మకథ

న్నాయి. వెంటనే పూరీ పరిగెత్తాను. మా గురుదేవులు కొన్ని వారాలుగా అక్కడుంటున్నాడు. పోన్లే, నువ్వు చివరి పరీక్షలకి వెళ్ళక్కర్లేదని ఆయన అంటారేమోనని రవ్వంత ఆశపడుతూ, నేనా పరీక్షలకి బొత్తిగా సిద్ధంకాకుండా ఉన్నానన్న సంగతి ఆయనకి నివేదించుకున్నాను.

శ్రీయుక్తేశ్వర్‌గారు చిరునవ్వు నవ్వుతూ నన్ను సముదాయించారు. “నువ్వు మనసారా ఆధ్యాత్మిక సాధన చేశావు. అంచేత కాలేజి చదువు ఉపేక్షించకుండా ఉండలేకపోయావు. వచ్చేవారం మాత్రం జాగ్రతగా పుస్తకాల్లో మునిగి ఉండు; ఓటమి లేకుండా గండం దాటతావు.”

అప్పుడప్పుడు నాలో సహేతుకంగా తల ఎత్తే సందేహాల్ని అణిచేసుకుంటూ కలకత్తాకు తిరిగి వచ్చాను. నా బల్ల మీదున్న పుస్తకాల గుట్టను పరకాయిస్తూ, నట్టడివిలో దారి తప్పిన బాటసారిలా ఆందోళన పడ్డాను.

చాలాసేపు ధ్యానం చేసిన మీదట నాకు శ్రమను తగ్గించే ఉత్తేజం కలిగింది. ప్రతి పుస్తకం అలవోకగా తెరిచి, ఎదుట కనిపించిన పుటలు మాత్రమే చదువుతూ వచ్చాను. ఇలా రోజుకు పద్దెనిమిది గంటల చొప్పున వారం రోజులపాటు ఈ పద్ధతి కొనసాగించే సరికి కంఠస్థం చెయ్యడమన్న కళలో నేను ఆరితేరాననిపించింది.

అడ్డాదిడ్డిగా కనిపించే నా దైవాధీనం చదువును, పరీక్ష హాళ్ళలో గడిచిన ఆ తరవాతి రోజులే సబబని నిరూపించాయి. పరీక్షలన్నీ ప్యాసయాను, వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పించుకొని. నా స్నేహితులూ మా ఇంట్లో వాళ్ళూ కురిపించిన అభినందనల్లో, నమ్మకశక్యం కానిదేదో జరిగినప్పుడు కనబరిచే ఆశ్చర్యం కూడా పొడగట్టింది.