పుట:Oka-Yogi-Atmakatha.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శశి, మూడు నీలాలు

319

పూరీనుంచి శ్రీరాంపూర్ తిరిగివచ్చిన తరవాత శ్రీయుక్తేశ్వర్‌గారు నన్ను ఆనందచకితుణ్ణి చేశారు.

“ఇంక నీ కలకత్తా చదువు అయిపోయింది. యూనివర్సిటీ చదువులో చివరి రెండేళ్ళూ నీకు ఇక్కడే, శ్రీరాంపూర్‌లో సాగేటట్టు చూస్తాను.”

నేను బిత్తరపోయాను. “గురుదేవా, ఈ ఊళ్ళో బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సు లేదండి,” అన్నాను. ఉన్నత విద్య బోధించే ఏకైక సంస్థ అయిన శ్రీరాంపూర్ కాలేజిలో రెండేళ్ళ ఇంటర్మీడియట్ కోర్సే ఉంది.

గురువుగారు కొంటెగా చిరునవ్వు నవ్వారు. “నీ కోసం బి. ఏ. కాలేజి పెట్టాలని చందాలు పోగు చెయ్యడానికి తిరగాలంటే ఈ ముసలితనంలో నా వల్ల కాదు. ఈ పని మరొకరి ద్వారా ఏర్పాటు చేయించాలనుకుంటాను.”

రెండు నెలల తరవాత శ్రీరాంపూర్ కాలేజి అధ్యక్షులు ప్రొఫెసర్ హోవెల్స్, నాలుగేళ్ళ కోర్సు నడపడానికి కావలసిన నిధులు సంపాదించండంలో తాము కృతకృత్యులమయామని బహిరంగంగా ప్రకటించారు. శ్రీరాంపూర్ కాలేజీ, కలకత్తా విశ్వవిద్యాలయానికి పూర్తి అనుబంధ శాఖ అయింది. శ్రీరాంపూర్‌లో బి. ఏ. తరగతిలో చేరిన తొలుతటి విద్యార్థుల్లో నే నొకణ్ణి.

“గురుదేవా, నా మీద మీ కెంత దయండి! కలకత్తా విడిచిపెట్టి, శ్రీరాంపూర్‌లో మీకు దగ్గరగా ఉండాలని ఎంతకాలం నుంచో ఉవ్విళ్ళూరుతున్నాను. పెదవి కదపకుండా మీరు చేసిన సహాయానికి ప్రొఫెసర్ హోవెల్స్‌గారు మీకు ఎంత ఋణపడి ఉన్నారో ఆయనకు తెలియదు!”

శ్రీయుక్తేశ్వర్‌గారు, తెచ్చి పెట్టుకున్న బింకంతో నావేపు చూపు