పుట:Oka-Yogi-Atmakatha.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

ఒక యోగి ఆత్మకథ

“సర్వవ్యాపకులైన గురుదేవా, మీ తేజస్సు నా బిడ్డను నయంచేసి నందుకు మీకు నా ధన్యవాదాలు!”

మామూలుగా ప్రాణాంతకం కావలసిన ఆ జబ్బు చటుక్కున నయమై నేను కోలుకోడానికి కారణమైన తేజఃప్రభను ఆవిడ కూడా చూసినట్టు గ్రహించాను.

నాకున్న అమూల్య వస్తుసామగ్రిలో అన్నిటికంటె విలువైనది ఆ పటమే. లాహిరీ మహాశయులు స్వయంగా ఇచ్చిన ఈ ఫొటో, పవిత్రమైన స్పందనల్ని ప్రసరిస్తుంది.

ఈ ఫొటో పుట్టుకకు వెనక అద్భుతమైన కథ ఒకటి ఉంది. దీన్ని మా నాన్నగారి సహశిష్యులైన కాశీకుమార్ రాయ్‌గారు చెప్పగా విన్నాను.

ఫొటోలో పడ్డమంటే మహాశయులకు కిట్టేది కాదు. ఒకసారి, ఆయన వద్దంటున్నా వినకుండా, ఆయన్నీ కాళికుమార్ రాయ్‌గారితోబాటు శిష్యబృందాన్ని కలిపి ఫొటో తియ్యడం జరిగింది. అయితే ఆ ఫొటో తాలూకు ప్లేటు చూసిన - తరవాత, ఫొటోగ్రాఫరు ఆశ్చర్యపోయాడు. శిష్యులందరి బొమ్మలు స్పష్టంగా వచ్చాయికాని, లాహిరీ మహాశయుల రూపురేకలు ఉండవలసిన స్థానంలో ఖాళీ తప్ప మరేమీ కనిపించలేదు. ఈ అద్భుతవిషయాన్ని గురించి విరివిగా చెప్పుకొన్నారు.

గంగాధర బాబనే విద్యార్థి ఒకడు మంచి నైపుణ్యంగల ఫొటోగ్రాఫరు. ఫోటో తియ్యబోతే మాయమైపోయే మహాశయుల రూపం తన కెమేరాను తప్పించుకుపోజాలదని దంభాలు పలికాడు. మర్నాడు పొద్దున అతను తన కెమెరా తీసుకువచ్చాడు. గురుదేవులు పద్మాసనం వేసుకొని ఒక కొయ్యబల్ల మీద కూర్చుని ఉన్నారు. ఆయన వెనకాల ఒక తెర వేలాడుతోంది. అప్పుడా అబ్బాయి, తను తలపెట్టిన పని నెరవేరడానికి