పుట:Oka-Yogi-Atmakatha.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం

13

నిండిన దేహాన్ని చూడ్డానికి ఎందుకూ రావడం- నేను మీ కూటస్థ (ఆధ్యాత్మిక దృష్టి) శ్రేణిలోనే ఎప్పుడూ ఉండగా ?” అని రాస్తూండే వారట.

నాకు ఎనిమిదేళ్ళ వయస్సప్పుడు, లాహిరీ మహాశయుల ఫొటోగ్రాఫు మూలంగా అద్భుతంగా స్వస్థత చేకూరే భాగ్యం కలిగింది. ఈ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది. బెంగాలులో మా వంశం వారికున్న ఇచ్చాపూర్ ఎస్టేటులో ఉండగా నాకు ఏషియాటిక్ కలరా అనే వ్యాధి వచ్చింది. నా మీద ఆశ వదులుకున్నారు; డాక్టర్లు ఏమీ చెయ్యలేకపోయారు. నా మంచం దగ్గర కూర్చున్న అమ్మ, నాకు తలాపి దిక్కున గోడమీద, పైన ఉన్న లాహిరీ మహాశయుల ఫొటో వేపు చూడమని బెంబేలుపడుతూ సైగ చేసింది.

“మనస్సులో ఆయనకి దండం పెట్టు.” ఆవిడకి తెలుసు, దండం పెట్టాలంటే చేతులు ఎత్తడానికి కూడా నేను ఓపిక లేనివాణ్ణని. “నువ్వు కనక నిజంగా నీ భక్తిని చూపించినట్లయితే, మనస్సులోనే ఆయనకు మొక్కినట్లయితే, నిన్నాయన చల్లగా చూస్తారు” అంది.

ఆయన ఫొటోవేపు తదేకంగా చూశాను. అక్కడ మిరుమిట్లు గొలిపే వెలుగు ఒకటి కనిపించింది. అది నా శరీరాన్నీ గదినీ చుట్టేసింది. వాంతి అయేటట్లనిపించే లక్షణంతో సహా, లొంగుబాటులోకి రాని ఇతర రోగ లక్షణాలన్నీ మటుమాయమయిపోయాయి; నాకు స్వస్థత చేకూరింది. అమ్మకి గురువుగారిపట్ల ఉన్న అపరిమితమైన విశ్వాసానికి నాలో సంతోషం ఉప్పొంగింది; వెంటనే ఆవిడ పాదాలమీదికి వాలి స్పృశించడానికి కావలసినంత బలం వచ్చేసింది. అమ్మ తన తలను ఆ చిన్న పటానికి పదేపదే ఒత్తుకుంది.