పుట:Oka-Yogi-Atmakatha.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

ఒక యోగి ఆత్మకథ

వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్ళల్లో అల్లా ఆయన ఫొటో మా పూజా మందిరానికి వన్నె తెస్తూండేది. అమ్మా నేను అనేక రోజులు, పొద్దుటా సాయంత్రమూ, తాత్కాలికంగా ఏర్పాటుచేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్ళం; సుగంధం గల చందనంలో ముంచిన పూలతో పూజ చేస్తుండే వాళ్ళం. సాంబ్రాణి, గోపరసం ధూపాలు వేసే వాళ్ళం; లాహిరీ మహాశయుల్లో సంపూర్ణంగా వ్యక్తమయిన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రపత్తులతో మేము ఆరాధించేవాళ్ళం.

ఆయన ఫొటో, నా జీవితం మీద చూపిన ప్రభావం మహత్తరమైనది. నేను పెరుగుతున్న కొద్దీ, ఆ మహాశయుల గూర్చిన భావనకూడా నాతోబాటు పెరుగుతూ వచ్చింది. ధ్యానంలో కూర్చుని ఉండగా, ఆ ఫొటోగ్రాఫులో ఉన్న ఆయన ఆకారం, ఆ చిన్న చట్రంలోంచి బయటికి వచ్చి సజీవ రూపం దాల్చి, నా ఎదట కూర్చున్నట్టుగా కనిపించేది తరచు. తేజోమయమైన దేహంతో ప్రకాశిస్తున్న ఆయన పాదాల్ని తాకడానికి నేను ప్రయత్నించినప్పుడు మళ్ళీ అది బొమ్మలా మారిపోయేది. శైశవం గడిచి బాల్యంలోకి ప్రవేశించేటప్పటికి, లాహిరీ మహాశయుల రూపం నా మనస్సులో, చట్రంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలోంచి స్ఫూర్తి మంతమైన సజీవ రూపంలోకి మారిపోయింది. ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడుకాని, సంక్షోభమేర్పడినప్పుడుకాని తరచుగా ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి; నాలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాణ్ణి.

ఆయన భౌతికరూపంలో జీవించడం లేదే అని, మొదట్లో బాధపడుతూ ఉండేవాణ్ణి. కాని గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించడం మొదలు పెట్టిన తరవాత ఇక బాధపడ్డం మానేశాను. తమను చూడాలని అతిగా ఆదుర్దాపడే శిష్యులకు ఆయన, “రక్తమాంసాలతో