పుట:Oka-Yogi-Atmakatha.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం

11

దూరం గుర్రబ్బండి మీద వెళ్ళి, తరవాత సన్నసన్నటి సందులగుండా నడిచి, ఏకాంతంగా ఉన్న ఇంటికి చేరుకున్నాం. గురువుగారు కూర్చునే చిన్న గదిలోకి ప్రవేశించి, వారికి ఎదురుగా ప్రణామం చేశాం. ఆయన పద్మాసనం వేసుకొని కూర్చుని ఉన్నారు. గుచ్చిగుచ్చి చూస్తూ, కళ్ళు మిలమిల్లాడించి మీ నాన్నగారిమీద చూపు నిలిపారు. ‘భగవతిబాబూ, మీ కింద పనిచేసే ఉద్యోగివిషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు!’ రెండు రోజుల కిందట గడ్డిబీడులో ప్రత్యక్ష మైనప్పుడు అన్న మాటలే ఇప్పుడు కూడా ఆయన అన్నారు. ఆ తరవాత, ‘అవినాశ్ బాబు నా దగ్గరికి రావడానికి మీరు అనుమతించినందుకూ అతనితోబాటు మీరు, మీ భార్యా కూడా వచ్చినందుకు చాలా సంతోషం,’ అని కూడా అన్నాడు.

“మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం[1] అనే ఆధ్యాత్మిక సాధనను ఉపదేశించి ఆనందపరిచారు. ఆ దర్శనం లభించిన రోజు చిరస్మరణీయమైన రోజు. ఆనాడు మొదలుకొని మీ నాన్నగారూ, నేనూ సహాధ్యాయుల్లా, సన్నిహిత మిత్రుల్లా ఉంటున్నాం. నీ పుట్టుక విషయంలో లాహిరీ మహాశయులు గాఢమైన ఆసక్తి చూపించారు. నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉండాలి; మహాగురువుల ఆశీస్సు ఎప్పటికీ వృథా కాదు.”

నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే లాహిరీ మహాశయులు తనువు చాలించారు. ఆయన ఫొటో ఒకటి అందంగా అలంకరించిన చట్రంలో మా ఇంట్లో ఉండేది. ఆఫీసువాళ్ళు చేసే బదిలీల

  1. లాహిరీ మహాశయులు బోధించిన యోగ విధానం. దీంతో, ఇంద్రియాలు రేపే కల్లోలం శాంతించి; ఈ విశ్వచైతన్యమే తాను అన్న గుర్తింపు ఎప్పటికీ పెరుగుతూ ఉండే విధంగా మానవుడు సాధన చెయ్యడానికి అవకాశ మేర్పడుతుంది. (చూడండి అధ్యాయం 26).