పుట:Oka-Yogi-Atmakatha.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శశి, మూడు నీలాలు

311

“ఆరోగ్యం మెరుగయిన తరవాత ఆయన్ని మాంసం తినొద్దని చెప్పు. అయినా నీ సలహా చెవినిపెట్టడనుకో; ఇంకో ఆరు నెల్లలో, తన ఆరోగ్యం అద్భుతంగా ఉందని అనుకునే రోజుల్లోనే చటుక్కున రాలి పోతాడు,” అని చెబుతూ మా గురుదేవులు, “ఆయుర్దాయంలో ఈ ఆరు నెల్ల పొడిగింపూ నువ్వు బతిమాలడంవల్లనే మంజూరయింది,” అని కూడా అన్నారు.

మరుసటి రోజున, కడియం చెయ్యడానికి ఒక కంసాలికి పురమాయించమని సంతోష్‌కు చెప్పాను. ఒక వారానికల్లా అది సిద్ధమైంది. కాని డా॥ రాయ్‌గారు దాన్ని వేసుకోనన్నారు.

“నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది. జ్యోతిషానికి సంబంధించిన ఈ మూఢవిశ్వాసాలతో నన్ను మభ్యపెట్టలేవు,” డాక్టరుగారు నావేపు కొర కొరా చూశారు.

గురుదేవులు ఈయన్ని మొండికేసిన గుర్రంతో పోల్చడం సబబుగానే ఉందన్న సంగతి గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను. మరో ఏడు రోజులు గడిచాయి; డాక్టరుగారు హఠాత్తుగా జబ్బు పడ్డారు. దాంతో ఆయన మెత్తబడి, కడియం వేసుకోడానికి ఒప్పుకున్నారు. మరో రెండు వారాలకి, ఆయనకి వైద్యంచేస్తున్న డాక్టరు, ఆయనమీద ఇంక ఆశ లేదని నాతో చెప్పాడు. మధుమేహంవల్ల లోలోపల కలిగే భయంకరమైన దుష్పరిణామాలు వివరించాడు.

నేను తల ఆడించాను. “ఒక నెల్లాళ్ళు జబ్బుతో బాధపడ్డ తరవాత డా॥ రాయ్‌గారికి మెరుగవుతుందని మా గురువుగారు చెప్పారండి,” అన్నాను.

ఆ డాక్టరు నా మాట నమ్మలేనట్టుగా నావేపు చూశారు. మరో