పుట:Oka-Yogi-Atmakatha.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

312

ఒక యోగి ఆత్మకథ

పదిహేను రోజుల తరవాత, తన పొరపాటు తెలుసుకున్నట్టుగా నన్ను బయటికి పిలిచారు.

“డాక్టర్ రాయ్‌గారు పూర్తిగా కోలుకున్నారు!” అంటూ ఆశ్చర్యం ప్రకటించారు. “నా అనుభవంలో ఇంతకన్న ఆశ్చర్యకరమైంది మరొకటి లేదు. ఇంక రేపోమాపో అనిపించేటట్టున్నవాడు ఇంత చిత్రంగా కోలుకోడం ఎన్నడూ చూడలేదు. మీ గురువుగారు నిజంగా, రోగాలు నయంచేసే ప్రవక్త అయి ఉండాలి!”

డా॥ రాయ్‌గారిని ఒకసారి కలుసుకుని, మాంసం కలవని భోజనం చెయ్యమని శ్రీ యుక్తేశ్వర్‌గారు ఇచ్చిన సలహా మళ్ళీ గుర్తుచేసి వచ్చిన తరవాత, ఆరు నెలలదాకా ఆయన్ని చూడలేదు. ఒకనాడు సాయంత్రం నేడు గుర్పార్ రోడ్డులో ఉన్న మా ఇంట్లో వసారాలో కూర్చుని ఉండగా, ఆయన మా ఇంటిదగ్గర కాసేపు మాట్లాడిపోదామని ఆగారు.

“మీ గురువుగారికి చెప్పు; తరచు మాంసం తింటూండడం వల్లే నేను పూర్తిగా బలం పుంజుకున్నానని. పథ్యాన్ని గురించి ఆయనకున్న శాస్త్రవిరుద్ధమైన అభిప్రాయాలు నా మీద పనిచెయ్యలేవు.” నిజమే డాక్టర్ రాయ్‌గారు ఆరోగ్యం రూపుగట్టినట్టున్నారు.

కాని ఆ మర్నాడే సంతోష్, పక్క బ్లాకులోఉన్న వాళ్ళ ఇంటినించి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, “నాన్నగారు పొద్దునే పోయారు!” అని చెప్పాడు.

గురుదేవుల సన్నిధిలో నాకు కలిగిన అతి విచిత్రమైన అనుభవాల్లో ఇది ఒకటి. ఆ పొగరుబోతు పశువైద్యుడు ఎంత అపనమ్మకంగా ఉన్నప్పటికీ గురుదేవులు ఆయనకి నయంచేశారు; ఆయన ఆయుర్దాయాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. నేను ప్రాధేయపడి కోరినందువల్లే ఇది