పుట:Oka-Yogi-Atmakatha.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

310

ఒక యోగి ఆత్మకథ

నావేపు పట్టిపట్టి చూశారు గురుదేవులు, ఆ సంశయాళువు వెళ్ళిపోయాక తలుపు మూసెయ్యగానే.

“గురుదేవా, ఆ డాక్టరుగారు సలక్షణంగా జీవించే ఉన్నారు కదండీ!”

“కాని త్వరలో చనిపోతాడు.”

ఆ మాటకు నేను అదిరిపడ్డాను. “ఆయన కొడుక్కిది పెద్ద దెబ్బ అవుతుంది. వాళ్ళ నాన్న గారి భౌతికవాద భావాల్ని మార్చడానికి టైము వస్తుందని సంతోష్ ఆశిస్తున్నాడు. ఆయనకి ఎలాగయినా మీరు సాయం చేయ్యాలని వేడుకుంటున్నాను.”

“సరే నీకోసం.” గురుదేవుల ముఖంలో ఉత్సాహమేమీ లేదు.

“ఈ పొగరుబోతు గుర్రాల డాక్టర్‌కి మధుమేహం బాగా ముదిరింది; ఆ సంగతి ఇతనికి తెలియదు. పదిహేనురోజుల్లో మంచం పడతాడు. ఇంక ఇతని పని అయిపోయినట్టేనని వదిలేస్తారు వైద్యులు; ఇతను ఈ లోకం విడిచిపోవడానికి సహజంగా నిర్ణయమైన కాలం, ఈవేళటికి ఆరు వారాలు, అయినా నువ్వు కలగజేసుకున్నావు కాబట్టి ఆ రోజున కోలు కుంటాడు. కాని ఒక్క షరతు; అతను గ్రహశాంతికోసం దండకడియం ఒకటి వేసుకునేటట్టు చెయ్యాలి. అయితే ఆపరేషను చెయ్యబోయేముందు గుర్రం ఎంత తీవ్రంగా విజృంభించి ప్రతిఘటిస్తుందో, అంత తీవ్రంగానూ అతను దాన్ని ప్రతిఘటిస్తాడనడంలో సందేహం లేదు,” అంటూ ముసి ముసిగా నవ్వారు గురుదేవులు.

డాక్టరుగారు దండకడియం వేసుకునేటట్టుగా బుజ్జగించి ఒప్పించడానికి, నేనూ సంతోషూ ఎలా ఒడుపులు వెయ్యాలా అని నేను ఆలోచిస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్‌గారు మరికొన్ని రహస్యాలు వెల్లడించారు.