పుట:Oka-Yogi-Atmakatha.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

ఒక యోగి ఆత్మకథ

అనేక సాధనాల ద్వారా, వెనకటి తప్పులవల్ల కలిగిన దుష్ఫలితాల్ని చాలావరకు తగ్గించుకోవచ్చు, లేదా నశింపు చేసుకోవచ్చు.

“పిడుగుపాటువల్ల తగిలే అదురుదెబ్బకు తట్టుకోడానికి ఇంటికి రాగితీగ అమర్చినట్లుగానే దేహమనే దేవాలయాన్ని కూడా కొన్ని పద్ధతుల్లో కాపాడుకోవచ్చు.”

“విద్యుత్, అయస్కాంత వికిరణాలు ఈ విశ్వంలో అవిచ్ఛిన్నంగా ప్రసరిస్తూ ఉన్నాయి; మనిషి శరీరానికి అవి మంచీ చెయ్యవచ్చు, చెరుపూ చెయ్యవచ్చు. అనేక యుగాల కిందట మన ఋషులు, సూక్ష్మమైన విశ్వవికిరణ ప్రభావాల దుష్ఫలితాల్ని పోగొట్టే సమస్యనుగురించి ఆలోచన చేశారు. స్వచ్ఛమైన లోహాలు గ్రహాల ప్రతికూలాకర్షణలకు శక్తిమంతమైన ప్రతిక్రియ చేసే సూక్ష్మకాంతిని విడుదలచేస్తాయని కనిపెట్టారు. కొన్ని ఓషధుల మేళనాలు కూడా సహాయకరంగా ఉంటాయని తేలింది. అన్నిటికన్న బాగా పనిచేసేవి, రెండు క్యారెట్లకు, తక్కువ బరువులేని నిఖార్సయిన రత్నాలు.

“జ్యోతిషశాస్త్రానికి వ్యవహారానుకూలంగా, దుష్ప్రభావాల్ని నిరోధించే ఉపయోగాలు ఉన్నాయి; కాని వాటినిగురించి భారతదేశానికి వెలుపల జరిగిన పరిశీలన మాత్రం చాలా తక్కువ. చాలామందికి తెలియని యథార్థం ఒకటి ఏమిటంటే, సరయిన రత్నాలు, లోహాలు, ఓషధులు, కావలసిన బరువు ఉంటేను, వాటిని ధరించినప్పుడు అవి చర్మాన్ని తాకుతూ ఉంటేను తప్ప వాటివల్ల ప్రయోజనం ఉండదు.”

“గురుదేవా, నేను తప్పకుండా మీ సలహా పాటించి ఒక కడియం సంపాదిస్తాను. గ్రహాన్ని ఓడించడమన్న ఆలోచన నన్ను ముగ్ధుణ్ణి చేస్తోంది!”