పుట:Oka-Yogi-Atmakatha.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహాల్ని ఓడించడం

291

నియమానుసారంగా సరిగా, సహజంగా జరగవలసిన సమయంలోనే జరుగుతాయి. గాఢంగా ప్రార్థన, ధ్యానం చేసిన తరవాత అతనికి దివ్య చైతన్యంతో సంపర్కమేర్పడుతుంది; ఆంతరికమైన ఆ రక్షణశక్తిని మించిన గొప్ప శక్తి మరొకటి ఏదీ లేదు.”

“అయితే, గురుదేవా, నన్ను జ్యోతిష సంబంధమైన దండకడియం వేసుకోమని ఎందుకంటున్నారు?” చాలాసేపు మౌనం వహించిన తరవాత నేను ఈ ప్రశ్న వెయ్యడానికి సాహసించాను; అంతవరకు నేను శ్రీ యుక్తేశ్వర్‌గారి గంభీరమైన వ్యాఖ్యానాన్ని ఒంటబట్టించుకోడానికి ప్రయత్నించాను, అందులో భావాలన్నీ నాకు చాలా కొత్త.”

“ప్రయాణికుడు తన గమ్యం చేరుకున్నప్పుడు మాత్రమే తన మ్యాప్‌లు తీసిపారెయ్యడం సబబు. ప్రయాణంలో సదుపాయంగా ఉండే ఏ అడ్డదారివల్ల నయినా, అతను లాభం పొందుతాడు. మానవుడు మాయలో ప్రవాసముండే కాలాన్ని తగ్గించడానికి సనాతన ఋషులు అనేక మార్గాలు కనిపెట్టారు. జ్ఞానసాధనంతో నేర్పుగా సర్దుబాటు చెయ్యగల కొన్నికొన్ని యాంత్రిక లక్షణాలు కర్మసూత్రంలో ఉన్నాయి.

“ఏదో ఒక విశ్వనియమోల్లంఘనవల్లనే మానవులకు కష్టాలు వస్తూంటాయి. మనిషి ఈశ్వరుడి సర్వశక్తిమత్వాన్ని నిరాదరించకుండానే ప్రకృతి నియమాల్ని పాటించాలని పవిత్రగ్రంథాలు సూచిస్తున్నాయి. ‘ప్రభూ, నిన్నే నమ్ముకున్నాను. నువ్వు నాకు సహాయం చెయ్యగలవని నాకు తెలుసు; అయినా నేను చేసింది ఏ తప్పయినా సరిదిద్దుకోడానికి నేను కూడా శాయశక్తులా, ప్రయత్నం చేస్తాను.’ అని చెప్పాలతను. ప్రార్థనవల్ల, సంకల్పశక్తి వల్ల, ధ్యానయోగంవల్ల, సాధుసత్పురుషులతో సంప్రదింపువల్ల , జ్యోతిషసంబంధమైన కడియాలు వేసుకోడంవల్ల