పుట:Oka-Yogi-Atmakatha.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

ఒక యోగి ఆత్మకథ

పద్ధతుల్లో విభిన్నతలు చూపే పునరుక్త నాదానికిగల అందమూ శక్తీ తెలుసు.

సంస్కృత సాహిత్యం 120 తాళాల్ని, అంటేకాల ప్రమాణాల్ని, వివరించింది. హైందవ సంగీతానికి సాంప్రదాయిక మూలపురుషుడయిన భరతుడు ఏట్రింతపక్షి పాటలో ముప్ఫైరెండు రకాల తాళాల్ని విడమరిచి చెప్పాడు. తాళానికి మూలం, మానవుడి ఒంటి కదలికల్లో ఉన్నది- నడకలో రెండింతలు, నిద్రలో శ్వాసించేటప్పుడు మూడింతలు - అంటే, ఊపిరి తీసుకునేటప్పుడు విడిచేటప్పటికన్న రెండింతల కాలం పడుతుంది.

భారతదేశం సనాతన కాలం నుంచీ, మానవ కంఠస్వరాన్ని పరిపూర్ణమైన ధ్వని పరికరంగా గుర్తిస్తోంది. అందువల్ల హైందవ సంగీతం, చాలావరకు మూడు స్వరస్థాయిల శ్రేణికి (మంద్ర, మధ్య, తారస్థాయిలు) పరిమితం చేసుకుంది. ఆ కారణంవల్లనే స్వరసంగతి (ఏకకాలంలో వెలువడే స్వరాల మధ్య సంబంధం) కన్న స్వరమాధుర్యానికి (అనుక్రమ స్వరాల మధ్య సంబంధానికి) ప్రాముఖ్యమివ్వడం జరిగింది.

హిందూ సంగీతం ఆత్మాశ్రయమైన, ఆధ్యాత్మికమైన, వైయక్తిక కళ; స్వరమేళన విభవం కన్న పరమాత్మతో వైయక్తిక సామరస్యం సాధించడం దాని లక్ష్యం. భారతదేశంలో, ప్రఖ్యాత గీతాలన్నీ దైవభక్తులు కూర్చినవే. సంగీత విద్వాంసుణ్ణి సంస్కృతంలో “భాగవతుడు” అంటారు; అంటే “భగవంతుణ్ణి కీర్తించేవాడు” అని అర్థం.

సంకీర్తనలు లేదా సంగీత సభలు, యోగవిద్యకు లేదా ఆధ్యాత్మిక శిక్షణకు స్ఫూర్తిమంతమైన రూపాలు; వీటికి గాఢమైన ఏకాగ్రతా, బీజ ప్రాయమైన ఆలోచనలోనూ నాదంలోనూ మనస్సును లగ్నం చెయ్యడం ఈ రెండూ అవసరమవుతాయి. మానవుడు స్వయానా ‘నాదబ్రహ్మ’ (‘సృజనాత్మక శబ్దం’) కు అభివ్యక్తి కాబట్టి, ధ్వని అతనిమీద ప్రబలమైన