పుట:Oka-Yogi-Atmakatha.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిద్రపోని సాధువు

243

ఇంతకు ముందుకు దారి చెప్పినవాడు నిజంగా బాటసారుల కొక పీడే, అనుకున్నాను దిగులుగా. ముతక బియ్యపు అన్నం, పప్పుదినుసు, బంగాళాదుంపలూ అరటికాయలూ కలిపి వండిన కూరలతో భోజనంచేసి, పక్క దొడ్లో ఉన్న చిన్న గుడిసెలో పడుక్కోడానికి వెళ్ళాను. దూరాన పల్లె ప్రజలు, గట్టిగా మద్దెళ్ళూ[1] తాళాలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ రాత్రి నిద్ర అన్న మాటే లేదు. ఏకాంతవాసం చేసే రామగోపాల్ యోగిగారి దగ్గరికి నాకు దారి చూపించమని గాఢంగా ప్రార్థన చేశాను.

తొలిసంజె వెలుగురేకలు గుడిసె కంతలగుండా పొడుచుకు వస్తున్న సమయంలో రణబాజ్‌పూర్ కు బయలుదేరాను. వరిచేలకు అడ్డబడి, సూదుల్లా గుచ్చుకునే ఎండుమోళ్ళు తొక్కుకుంటూ, ఎండిపోయిన బంకమట్టి గుట్టలకు ప్రదక్షిణలుచేస్తూ నడక సాగించాను. అక్కడక్కడ దారిని పోయే రైతు ఒకడు కనబడడం, నేను చేరవలసిన చోటు ఇంక “ఒక్క కోసెడు మాత్రమే (రెండు మైళ్ళు)” ఉందని చెప్పడం జరుగుతుండేది. ఆరు గంటల్లో సూర్యుడు విజయోత్సాహంతో నడినెత్తికి వచ్చాడు కాని, నేను రణబాజ్ పూరుకు ఎప్పటికీ ఒక కోసెడు దూరంలోనే ఉంటాననిపించడం మొదలయింది.

మిట్టమధ్యాహ్నానికి నా లోకమింకా అంతులేని వరిచేనే. ఎండ వేడికి నేను దాదాపు వడగొట్టి పడిపోయే స్థితికి వచ్చాను. ఇంతలో ఒకాయన నిదానంగా అడుగుతీసి అడుగువేస్తూ నా దగ్గరికి వస్తూండడం గమనించాను. నా మామూలు ప్రశ్న మళ్ళీ వెయ్యడానికి పూనుకోలేదు;

  1. మత సంబంధమైన ఉత్సవాలు జరిగినప్పుడు, ఊరేగింపులప్పుడు, భక్తిపరమైన కీర్తనలు పాడేటప్పుడు మద్దెళ్ళు ఉపయోగించడం మామూలు.