పుట:Oka-Yogi-Atmakatha.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

ఒక యోగి ఆత్మకథ

వెళ్ళాను. దారి సరయినదేనన్న నమ్మకం లేదు. దారినిపోయే బాటసారిని అడిగేసరికి అతను చాలా సేపు ఆలోచనలో పడ్డాడు.

“నాలుగు దారుల కూడలి వచ్చినప్పుడు కుడివేపు తిరిగి ముందుకు సాగు,” అన్నాడు చివరికి, తన మాటకి తిరుగులేదన్నట్టు.

అతని మాట పట్టుకుని, కాలవగట్ల వెంబడే దారితీశాను. చీకటి పడింది; అడవిలో ఉన్న పల్లెశివార్లలో మిణుగురు పురుగుల మెరుపులతోను, దగ్గరలో ఉన్న గుంటనక్కల అరుపులతోనూ సంచలనం కనిపిస్తోంది. వెన్నెల పలచగా, నా కేమీ కొరగాకుండా ఉంది; రెండు గంటల సేపు తడబడుతూ నడిచాను.

ఆవు మెడలో గంట ఒకటి నాకు స్వాగతం పలికింది. పదే పదే నేను వేసిన కేకలకు చివరికి ఒక రైతు నా దగ్గరికి వచ్చాడు.

“నేను, రామగోపాల్ బాబుగారికోసం వెతుకుతున్నాను.”

“అటువంటాయనెవరూ మా పల్లెలో లేడు,” అంటున్న అతని గొంతులో చిరాకు కనిపించింది. “నువ్వు అబద్ధాలాడే పత్తేదారువయి ఉంటావు.”

రాజకీయమైన గొడవలతో ఇబ్బందిపడ్డ అతని మనస్సులో అనుమానం లేకుండా చెయ్యాలన్న ఆశతో, అతని మనస్సుకు హత్తుకునేలా నేను నా దీనావస్థను వివరించాను. ఆయన తనింటికి తీసుకువెళ్ళాడు నన్ను; ఆదరపురస్సరంగా ఆతిథ్యమిచ్చాడు. .

“రణబాజ్‌పూర్ ఇక్కడికి చాలా దూరం,” అన్నా డాయన, “నాలుగు వీథుల మొగలో, నువ్వు ఎడమవేపు తిరగవలసింది; కుడివేపు కాదు.”