పుట:Oka-Yogi-Atmakatha.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

ఒక యోగి ఆత్మకథ

“ఒక్క కోసెడు మాత్రమే” అన్న జవాబు వినివిని విసుగెత్తి, మళ్ళీ అదే వినవలసి వస్తుందేమోనని.

ఆ అపరిచితులు నా పక్కన ఆగారు. పొట్టిగా, సన్నగా ఉన్నారు. సూదుల్లా గుచ్చిగుచ్చి చూసే, అసాధారణమైన రెండు నల్లటి కళ్ళు మినహాగా ఆయన రూపంలో ఆకట్టుకునేది ఏదీ లేదు.

“నేను రణబాజ్‌పూర్ విడిచి వెళ్ళాలనుకున్నాను. నువ్వు ఉద్దేశించిన ప్రయోజనం మంచిది. అంచేత నీకోసం కాసుకొని ఉన్నాను.” నేను కొయ్యబారి చూస్తుంటే, ఆయన నా ముఖంలోకి వేలు ఆడిస్తూ అన్నారు. “గడుసుగా, చెప్పా పెట్టాకుండా నా మీదికి వచ్చిపడొచ్చుననుకున్నావు.కదూ? అయినా ఆ ప్రొఫెసరు బిహారికి, నా ఎడ్రస్ నీకు ఇచ్చే హక్కు లేదు.”

ఈ మహాపురుషుల ముందు నన్ను నేను పరిచయం చేసుకోడం కేవలం అధిక ప్రసంగం కిందికి వస్తుందని, నాకు లభించిన ఇటువంటి ఆదరానికి కొద్దిగా నొచ్చుకుంటూ మాటా పలుకూ లేకుండా నిలబడి పోయాను. ఆ తరవాత అకస్మాత్తుగా ఆయన వ్యాఖ్య వెలువడింది.

“చెప్పు, దేవుడు ఎక్కడున్నాడనుకుంటున్నావు?”

“అదేమిటండి, నాలోనూ అంతటానూ ఉన్నాడు!” నా కెంత గాభరా కలిగిందో నన్ను చూస్తేనే తెలుస్తుందనడంలో సందేహం లేదు.

“అంతటా వ్యాపించి ఉన్నవాడు, కదూ?” ఆ సాధువు ముసి ముసిగా నవ్వారు. “అయితే చిన్నబాబూ, నిన్న నువ్వు తారకేశ్వర ఆలయంలో అనంతుడైన సర్వేశ్వరుడికి చిహ్నమైన రాతి లింగానికి ఎందుకు మొక్కలేదు మరి?[1] నీ గర్వమే నీ శిక్షకు కారణమయి, కుడి

  1. "దేనికీ తలవంచనివాడు తన బరువు తాను మోసుకోలేడు.” -డాస్టావ్‌స్కి, ‘ది పొసెస్డ్’ అన్న నవలలో.