పుట:Oka-Yogi-Atmakatha.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

223

“ముకుందుడు చెప్పింది నిజమే కావచ్చు.” గురుదేవులు ఆ అబ్బాయికి ఇచ్చిన జవాబు, ఎన్నడూలేనంత నిరుత్సాహంగా ఉంది.

ఒక ఏడాది తరవాత కుమార్, తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు. గురుదేవులు మౌనంగా తెలిపిన అసమ్మతిని అతను ఉపేక్షించాడు; శ్రీయుక్తేశ్వర్‌గారు తమ శిష్యుల రాకపోకలను ఎన్నడూ అధికారం చూపించి అదుపులో పెట్టలేదు. కొద్ది నెలల్లో తిరిగి శ్రీరాంపూర్ వచ్చే నాటికి ఆ అబ్బాయిలో కొట్టవచ్చినట్టు మార్పు కనిపించింది. ప్రశాంతంగా ప్రకాశించే ముఖంతో రాజసం ఉట్టిపడే కుమార్ లేడిక; ఉత్తరోత్తరా చెడ్డ అలవాట్లు చేసుకున్న మామూలు పల్లెటూరి పడుచువాడొకడు మా ముందు నిలబడ్డాడు.

గురుదేవులు నన్ను పిలిచారు; ఆ కుర్రవాడు ఇప్పుడు ఆశ్రమ జీవితానికి తగ్గవాడు కాడన్న యథార్థాన్ని భగ్నహృదయంతో చెబుతూ నాతో చర్చించారు.

“ముకుందా, రేపే ఆశ్రమం విడిచి వెళ్ళమని కుమార్‌కు చెప్పే పని నీకు అప్పగిస్తున్నాను; నే నది చెయ్యలేను!” శ్రీయుక్తేశ్వర్‌గారి కళ్ళలో నీళ్ళు నిలిచాయి. కాని వాటిని త్వరగానే ఆపుకొన్నారు. “ఆ అబ్బాయి నా మాట విని, ఊరికి వెళ్ళకుండా, చెడుసావాసాలు చెయ్యకుండా ఉంటే ఇంత అధోగతికి పోయేవాడు కాడు. నా రక్షణ తిరస్కరించాడు. ఇప్పుడిక కఠిన ప్రపంచమే అతనికి గురువుగా ఉండాలి.”

కుమార్ వెళ్ళిపోవడం నా కేమీ సంతోషం కలిగించలేదు; గురుదేవుల అభిమానాన్ని సంపాదించే శక్తి గలవాడు ప్రాపంచిక ప్రలోభాలకు అంత సులువుగా ఎలా లోబడిపోయాడా అని విచారించాను. మద్యంవల్లా మగువవల్లా సుఖానుభవం పొందడమన్నది ప్రకృతిసిద్ధంగా జీవించే మనిషిలో పాదుకొని ఉన్నది. వాటిని మెచ్చుకోడానికి సూక్ష్మజ్ఞాన మేమీ